Venkayyanaidu-image

భిన్నత్వంలోని ఏకత్వాన్ని చూసి మనం గర్వపడాలి. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సామాజిక, ఆర్థికాంశాల్లో విభిన్న ఆలోచనలను అనుమతిస్తుంది. నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా అందరమూ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తాం. మనం విభిన్న పార్టీలకు చెందినవారైనా ఉమ్మడి లక్ష్యం మాత్రం దేశ బలోపేతమే.. దేశాన్ని సుస్థిరంగా, సమున్నతంగా, సౌభాగ్యంగా తయారుచేయడమే.. అట్టడుగునున్నవారికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే.. మనమంతా రాజకీయ ప్రత్యర్థులమే కాని శత్రువులం కాదు.
– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా తెలుగుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్‌నేతలు ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషితోపాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంటు ఉభయసభల్లోని అధికార, ప్రతిపక్షనేతలు పాల్గొన్నారు.

ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధికార లాంఛనాల మధ్య దర్బార్‌హాల్‌లోకి వచ్చి ఆశీనులయ్యారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఉత్తర్వులను చదివి కేంద్రహోంశాఖ కార్యదర్శి రాజీవ్‌మహర్షి చదివి వినిపించారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హామీద్‌అన్సారీ పదవీకాలం ముగిసినందున ఆయన స్థానంలో వెంకయ్య నాయుడు ఎంపికైనట్లు చెప్పి ఆయనను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని కోరారు. ఇందుకు రాష్ట్రపతి సమ్మతించగానే.. హోంశాఖ కార్యదర్శి అధికారికంగా వెంకయ్యనాయుడిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. అనంతరం ఆయనచేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హిందీలో పదవీ ప్రమాణం చేయించారు. తన ట్రేడ్‌మార్క్‌ తెలుపు చొక్కా, పంచె ధరించిన వెంకయ్య.. భగవంతుడి పేరిట ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం అంతా పదినిమిషాల్లో పూర్తయింది. ప్రమాణస్వీకారానికి ముందు వెంకయ్యనాయుడు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం మార్గమధ్యలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌, సర్దార్‌వల్లభాయ్‌పటేల్‌ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన సతీమణి ఉషతో కలిసి వచ్చారు. ఆయన కుటుంబసభ్యులతోపాటు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాలేదు. కాంగ్రెస్‌ తరఫున మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఉభయసభల నేతలు గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వసుంధర రాజే, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దేవేంద్ర ఫడణవీస్‌, రమణ్‌సింగ్‌, యోగి ఆదిత్యనాథ్‌, మనోహర్‌ పారికర్‌, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, లక్ష్మణ్‌, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఎంపీలు సీఎం రమేష్‌, మాగంటి బాబు, శ్రీరాం మాల్యాద్రి, తెరాస ఉభయసభా పక్షనేతలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, తెలంగాణ భాజపా నేత కిషన్‌రెడ్డి, ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, పారిశ్రామికవేత్తలు గ్రంధి మల్లికార్జునరావు, చిగురుపాటి కృష్ణప్రసాద్‌, ఉమా, టీవీ5 ఛైర్మన్‌ బీఆర్‌నాయుడు తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి ఓఎస్డీగా సత్యకుమార్‌
ఉపరాష్ట్రపతి కార్యదర్శి వర్గంలో తొలి నియామకం జరిగింది. ఓఎస్డీగా వై.సత్యకుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏబీవీపీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన ఈయన, గత 24 సంవత్సరాలుగా వెంకయ్యనాయుడు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వెంకయ్యనాయుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండగా అదనపు కార్యదర్శిగా పనిచేశారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఉపరాష్ట్రపతి కార్యవర్గంలో ప్రత్యేక అధికారిగా నియామకం పొందారు. తొలిసారిగా ఆలిండియా సర్వీసులకు చెందని వ్యక్తిని ఓఎస్డీగా నియమించారు.