దేవాలయ ప్రాంగణంలోనే కల్యాణమండపం
సమీక్షలో సీఎం కేసీఆర్‌

భద్రాచలం సీతారామ స్వామి ఆలయాన్ని దేశంలోనే అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆలయానికున్న ప్రాశస్త్యం ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామచంద్రునికున్న ఆదరణ దృష్ట్యా ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కులలో ఉన్న స్థలాలను కలుపుకొని దాదాపు 30 ఎకరాల్లో విస్తరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న దేవాలయ గర్భగుడి, ఇతర కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణాలు చేపట్టాలని, దేవాలయ ప్రాంగణంలోనే కల్యాణమండపం, షాపింగ్‌ కాంప్లెక్సు, భక్తులు సేదతీరే ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

చినజీయర్‌ స్వామి సూచనలకు అనుగుణంగా ఆలయశిల్పి ఆనంద్‌సాయి బృందం రూపొందించిన అభివృద్ధి నమూనాలను సీఎం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ‘గోదావరి నది సరిగ్గా భద్రాచలం ఆలయం వద్దే మలుపు తిరిగి తూర్పు దిశగా ప్రవహిస్తుంది. కొద్ది దూరం పోయిన తర్వాత ఉత్తర వాహినిగా మారుతుంది. రామచంద్రుడు కూడా పశ్చిమదిక్కు నుంచి తూర్పుదిక్కుకు వచ్చి ఇదే ప్రాంతంలో నడయాడారు. భద్రాద్రి ఆలయానికి ఎంతో స్థల మహత్యం, పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. శ్రీరామచంద్రుడిని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా పూజిస్తారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆయన భక్తులున్నారు. రాముడు అందరి దేవుడు. ఆయన కొలువై ఉన్న భద్రాచలానికి తెలంగాణతో పాటు పొరుగున ఉన్న ఏపీ, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. సీతారామకల్యాణం సమయంలో ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఎంత మంది భక్తులు వచ్చినా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా భగవంతుని దర్శనం, గోదావరిలో పుణ్యస్నానం చేయడానికి అనువుగా ఏర్పాట్లు ఉండాలి. రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి.

విమానాశ్రయం నిర్మిస్తున్నాం: కొత్తగూడెం-భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మిస్తున్నాం. కొత్తగూడెం వరకున్న రైలు మార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించే ప్రతిపాదనలను రైల్వే శాఖకు పంపించాం. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రహదారి సౌకర్యం కలుగుతుంది. ఇటు ఏపీ రాజధాని అమరావతి, అటు చత్తీస్‌గఢ్‌, ఒడిషాలను కలిపే మార్గాలను ఏర్పాటు చేస్తున్నాం. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న వంతెనతో పాటు మరో వంతెన నిర్మిస్తున్నాం. గోదావరి నదిలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా ప్రాజెక్టులు వస్తున్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. అన్ని విధాల భద్రాద్రి అలరారే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అన్నారు. సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.