జన భాషకు దార్శనికుడు!
తెలంగాణ భాషా దినోత్సవం
నేడు కాళొజీ జయంతి
 

కాళొజీ నారాయణరావు.. ఈ పేరు వినగానే నెరిసిన గడ్డంతో ముఖంపై ముడతలు పడి భుజాన సంచి వేసుకొని ఒక సాధారణ వ్యక్తిగా తెలంగాణ ప్రజల కళ్ల ముందు కదులాడుతుంది. ఈయన రచించిన కవితలన్నీ మాండలికాలతో అందరి నోట పలికిస్తోంది.. ‘నా గొడవ’ ఆత్మకథలో కవితలన్నీ సకల జనుల సమస్యలు .. మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతపర్చేలా చేశాయి. ఆయన రచనలు మనం మాట్లాడుకునే మాండలికానికి గౌరవం తెచ్చి పెట్టాయి. ఇంతటి మహనీయుడి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కాళొజీతో జిల్లావాసులకున్న అనుబంధాన్ని వివరిస్తూ ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సదాశివ మాస్టారు కాళొజీని ‘కాకా’ పిలిచేవారు
ప్రజాకవి కాళొజీ నారాయణరావు, ఆదిలాబాద్‌కు చెందిన మాస్టర్‌ సామల సదాశివ ఇద్దరు మంచి స్నేహితులు. సదాశివ వరంగల్‌కెళ్తే కాళొజీని ఎంతో అప్యాయంగా ‘కాకా’ అని పిలిచేవారు. వారి ఆత్మీయానుబంధం ఏపాటిదో దీన్నిబట్టి అర్థమవుతుంది. సదాశివ తన యాది పుస్తకంలో ఈ విషయాలన్నీ వివరించారు. కాళొజీ స్మారక పురస్కారం తెలంగాణలోనే తొలిసారి సామల సదాశివకు వరించింది. 2011లో ఆయన రచనలకు కాళొజీ ఫౌండేషన్‌ అందించిన జ్ఞాపిక పైన ఇద్దరి చిత్రాలు పెట్టి ఇవ్వడం వారిమధ్య ఆత్మీయ అనుబంధానికి నిదర్శనం.

ఇద్దరం నారాయణులే..
మావల మండలం కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్న ఉదారి నారాయణ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిగా ప్రముఖ కవిగా జిల్లా వాసులకు సుపరిచితుడు. కాళొజీతో ఈయన ఓ చమత్కారమైన అనుభూతిని పొందారు. హైదరాబాద్‌లో చదువుతున్నప్పుడు ఈయన గురువు గోపీ దగ్గరుండి కాళొజీని పరిచయం చేశారు. 2001లో ‘ఆకుపచ్చని ఎడారి’ రచనకు ముందుమాట రాయించేందుకు వరంగల్‌లో ఉన్న కాళొజీ ఇంట్లో మూడురోజులు ఉన్నారు. తెలంగాణ యాస, బాసతో ఉన్న కవితలను చదివి చలించారు. ‘నేనూ నారాయణున్ని.. నీవు నారాయుణునివే..మనమిద్దరం నారాయణులు..’ అన్న సంఘటన ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉందని ఉదారి నారాయణ అన్నారు.

‘నా గొడవ’తో ప్రేరణ పొందారు
‘అన్యాయాన్ని ఎదిరిస్తే.. నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు..’’ కాళొజీ తన ఆత్మకథ ‘నా గొడవ’లో రచించిన కవిత్వానికి ఉట్నూరుకు చెందిన గోపగాని రవీందర్‌ ప్రేరణ పొందారు. మాండలికాలతో ఉన్న కాళొజీ కవిత్వం ఈయన రచనలు చేయడానికి ఎంతో దోహదపడ్డాయి. ఉట్నూరు సాహితీ వేదికను స్థాపించి తెలంగాణ యాస, బాస ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాళొజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘నా గొడవ’ కవిత్వంపై ఉట్నూరులోని బీఈడీ కళాశాలలో 2013లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గిరిజనులకు మన ప్రాంత యాసను పరిచయం చేశారు. తెలంగాణ సజీవ భాషకు ఆయన రచనలు నేటితర రచయితలకు, కవులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, తెలంగాణ యాసకు ప్రాణం పోసిన ప్రజాకవి తన అనేక రచనలకు ప్రేరణనిచ్చాయంటున్నారు.

మన యాసకు ప్రాణం పోస్తున్న ‘ఆకాశవాణి’
‘‘మన బాస, మన యాస, మన ఎఫ్‌.ఎం.’’ ఇది ఆదిలాబాద్‌ ఆకాశవాణి కేంద్రంలో అచ్చమైన తెలంగాణ భాష, జన భాషలో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. శ్రోతలకు ఆదిలాబాద్‌ ప్రాంత మాండలికాలతో ముచ్చటిస్తున్నారు. సుప్రభాతంతో మొదలుకొని నిద్రించే వరకు తెలంగాణ యాసలోనే వ్యాఖ్యానం చేస్తున్నారు. తెలంగాణ భాషా మాధుర్యాన్ని విస్తృత పర్చేందుకు రోజూ రాత్రి 9.20 నిమిషాలకు పుస్తకంతో, నవలతో, కథనం, బాస రుచులు అనే శీర్షికలతో చక్కటి తెలుగు వచన, రచనలను శ్రోతలకు వినిపిస్తున్నారు. ఇదొక్కటే కాకుండా తెలంగాణ యాసలో మరిన్ని కార్యక్రమాలు ప్రసారం చేయడం, స్థానిక భాషలోనే ముచ్చటించడంతో జిల్లా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, దీంతో వారికి మరింత దగ్గరవుతున్నామని కేంద్రం సహాయ సంచాలకుడు సుమనస్పతీరెడ్డి అన్నారు. కాళొజీ రచనలు తనకు ప్రభావితం చేశాయన్నారు.

కాళొజీ నుంచి జాలువారిన తెలంగాణ ముచ్చట్లు
ఏబది నుంది శాసన సభ్యులకు
ఏడు వందల నల్లాలు
ఏడు వందల కూలీలకు
ఏడిస్తేనే నీళ్లు
అన్నపు రాశులు ఒక చోట
ఆకలి మంటలు ఒక చోట
కమ్మని చకిలాలొక చోట
గట్టిదవడలింకొక చోట
హంస తూలికలు ఒక చోట
ఆలసిన దేహాలొక చోట
కళా ప్రదర్శనలొక చోట
కళారాధలింకొక చోట
సంపదలన్నీ ఒక చోట
గంపెడు బలగం ఒక చోట
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా
ఏ భాష నీది ఏమి వేషమురా
ఈ భాష ఈ వేషమెవరి కోసమురా
ఒకే ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు బైరన్‌
నిజమేనా అది
మరి నేను ఒలకబోసిన సిరా సీసాలకొద్దిగాదు పీపాలకొద్ది
ఏ ఒక్క మెదడు కదలినట్టు లేదు మొదట నా మెదడులో
ఉంటేగా కదలిక మరోడ్ని కదిలించే

వాడుకలో ఉన్న కొన్ని మాండలికాలు
కచ్చురం – ఎడ్లబండి, ఎలగడ – నిప్పు, యాది – జ్ఞాపకం
పీనుగు – శవం, దూప – దాహం, ఎక్క – దీపం
యాకం – ఎక్కువ, సోల్పు – వరస, పరస్తవారం – విశాలంగా