డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. గ్రేటర్‌ పరిధిలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఏటా 25వేల నుంచి 30వేల వరకు ఇండ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించాలని నిర్ణయించి, చకచకా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే 20 వేల ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, మిగతా ఇండ్ల టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉన్నది. రెండువైపులా నిర్మాణాలు కొనసాగుతుండడంతో నిర్మాణ సామాగ్రితోపాటు, నిపుణుల కొరత కూడా ఏర్పడింది. మొత్తం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభమైతే ఈ ఇబ్బంది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నది. తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు తదితర వృత్తుల వారికి గిరాకీ పెరుగుతుందని, ఇసుక, ఇటుకకు కూడా కొరత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష ఇండ్లను పూర్తి చేసి పేదలకు అందించాలని కృతనిశ్చయంతో ఉన్నందున ఆధునిక పద్ధతులు అవలంభించక తప్పదని అధికారులు, బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు.

ఉదాహరణకు.. లక్ష ఇండ్లకు సరిపడా తాపీ పనివారు దొరుకడం కష్టం, తక్కువ సమయంలో అన్ని ఇండ్లకు సరిపడా తలుపులు, కిటికీలను కార్పెంటర్లతో చేయించడం సాధ్యమయ్యే పనికాదు. కాబట్టి నిర్మాణ పనులకు టన్నెల్‌ ఫామ్‌, ప్రీ ఫ్యాబ్రికేషన్‌ టెక్నాలజీలను వినియోగించాలని భావిస్తున్నారు. తలుపులు, కిటికీలకోసం ఫ్యాబ్రికేషన్‌ మెషిన్లను దిగుమతి చేసుకోసుకోవాలని నిర్ణయించారు. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో ఇండ్లు నిర్మించాల్సి వస్తుండడంతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు విదేశాల్లో అమలు చేస్తున్న టెన్నల్‌ ఫామ్‌, ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీల వైపు మొగ్గు చూపుతున్నారు. స్లాబ్‌ కోసం సెంట్రింగ్‌ కొట్టినట్టే స్లాబ్‌తోపాటు, గోడల కోసం ఇనుప ప్లేట్లు బిగించి, మొత్తంగా ఒకేసారి కాంక్రీట్‌తో నింపడాన్ని టెన్నల్‌ఫామ్‌ టెక్నాలజీ అంటారు. కిటికీలు, తలుపులు, గోడలు, స్లాబులు ముందుగానే తయారుచేసి ఒకేసారి బిగించే టెక్నాలజీని ప్రీ ఫ్యాబ్రికేషన్‌ టెక్నాలజీ అని పిలుస్తుంటారు. తలుపులు, కిటికీలు తదితర వంటి వస్తువులను తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో తయారుచేసే మెషిన్లను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు.

ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ పనులు సైతం తక్కువ సమయంలో పూర్తిచేసే విధానాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు కొందరు బిల్డర్లు ఇప్పటికే చైనా వెళ్లినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆధునిక పద్ధతులకు పెట్టుబడి అధికంగా అవుతుందని, ఒకేచోట ఎక్కువ సంఖ్యలో ఇండ్లు నిర్మించే వారికి గిట్టుబాటు అవుతుందని అధికారులు చెప్తున్నారు. రాంపల్లిలో ఒకేచోట ఆరువేల ఇండ్లు నిర్మిస్తుండగా, సదరు కాంట్రాక్టర్‌ టన్నెల్‌ ఫామ్‌ టెక్నాలజీని వినియోగించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన యంత్రసామగ్రిని టర్కీ నుంచి దిగుమతి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కొల్లూరులో ఒకేచోట 15 వేల ఇండ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం టెండర్ల దశ కొనసాగుతున్నది. ఈ కాలనీని నిర్మించేందుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఆసక్తిగా ఉన్నది. పనులు దక్కితే గోడలు, స్లాబుల నిర్మాణానికి మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఉపయోగించిన ప్రీ కాస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తున్నారు. మియాపూర్‌, నాగోల్‌ ప్రాంతాల్లో సరిపడా స్థలంతోపాటు అవసరమైన పనిముట్లు, యంత్రసామాగ్రి వారికి ఉండడం వారికి కలిసొచ్చే అంశం.

ఇసుక కొరతను అధిగమించేందుకు కాంట్రాక్టర్లు రోబో సాండ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. నగర పరిసరాల్లో పలు రోబోసాండ్‌ తయారీ ప్లాంట్లు ఉండడంతోపాటు, ఇసుకకన్నా తక్కువ ధరకు లభ్యమవుతున్నది. రాయిని నిర్ణీత సైజులో పొడిచేస్తే ఇసుకతో సమానంగా నాణ్యత కలిగి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నిర్మాణాలన్నింటిలో రోబో సాండ్‌ వాడినవేనని పేర్కొంటున్నారు. అదేవిధంగా నిర్మాణాల్లో ౖఫ్లెయాష్‌తో తయారైన ఇటుకలను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇవి మార్కెట్‌లో విరివిగా లభించడంతోపాటు, నాణ్యతలో మట్టి ఇటుకలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండడంతో వీటివైపు మొగ్గుచూపుతున్నారు.