దేశవ్యాప్తంగా నదుల అనుసంధానించాలని సంకల్పిస్తే తొలుత మహానది- గోదావరిలను అనుసంధానం చేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారమిక్కడ కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో 31వ జాతీయ జలవనరుల అభివృద్ధిసంస్థ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గోదావరిలో మిగులు జలాలున్నాయని ఇచ్చంపల్లి, పులిచింతలకు నీరు మళ్లిస్తున్నారని, వాస్తవానికి అంత నీటి లభ్యత లేదని హరీశ్‌రావు సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తెలంగాణకు కేటాయింపుల్లో భాగంగా వచ్చిన నీటితోనే కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే దానికి నీటిలభ్యత అనుమతులు ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మహానది-గోదావరిలను తొలిగా అనుసంధానించాలని తెలంగాణ తరఫున చెప్పానని, ఈ ప్రక్రియకు ఒడిశాను ఒప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని హరీశ్‌ పేర్కొన్నారు.

రెండు, మూడు రాష్ట్రాల్లో ఉన్న నదుల అనుసంధానంలో చిక్కులు ఎదురవుతాయని, ఇలాంటి సందర్భాల్లో ఇంటర్‌ లింకింగ్‌తోపాటు ఇంట్రా లింకింగ్‌ గురించి కేంద్రం ఆలోచించాలన్నారు. ఒకేరాష్ట్రంలో ఒకచోట నీటిని మరోచోటుకు తీసుకువెళ్లేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీరు రాని పరిస్థితి ఉందని చెప్పానన్నారు. గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించేలా కేంద్రం చొరవ చూపాలని పేర్కొన్నారు. త్వరలోనే నదుల అనుసంధానంపై కేంద్రం బృహత్తర ప్రాజెక్టు చేపట్టనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10తో పనులు చేయాల్సి ఉంటుందని గడ్కరీ చెప్పారన్నారు. మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని సమావేశంలో కేంద్రమంత్రి ప్రశంసించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

కేంద్రమంత్రికి వినతులు: రాజీవ్‌భీమా ఎత్తిపోతలకు రూ.107.49 కోట్లు, శ్రీరాంసాగర్‌ స్టేజ్‌-2కి రూ.31.345 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రి గడ్కరీకి హరీశ్‌రావు వినతిపత్రం అందజేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌-2 రిపేర్‌, రెనోవేషన్‌, రెస్టోరేషన్‌(ఆర్‌ఆర్‌ఆర్‌)లో భాగంగా చేపట్టిన పనులు పూర్తికి మరికొంత సమయమివ్వాలని, ఆర్‌ఆర్‌ఆర్‌-3 బ్యాచ్‌-2లోనూ, ఆర్‌ఆర్‌ఆర్‌-3 బ్యాచ్‌3లో భాగంగా వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలన్నారు.

‘మినుములను మద్దతు ధరకు కొనండి’
తెలంగాణలో ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో పండించిన మినుములకు ధర తక్కువగా వస్తున్నందున రైతులు నష్టపోతున్నారని, వెంటనే మద్దతు ధరకు కొనాలని కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌కి మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ఈ సీజన్‌లో 29 వేల హెక్టార్లలో ఈ పంట సాగయిందని మొత్తం 26,711 టన్నుల దిగుబడి రానుందన్నారు. రైతులు ఇప్పటికే మార్కెట్‌కు తెస్తున్న పంటను క్వింటాకు రూ.4 వేల నుంచి 4800 వరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాదికి కేంద్రం మినుములకు మద్దతు ధరగా రూ.5400గా ప్రకటించిందని, కానీ కొత్త మద్దతు ధర వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. తెలంగాణ రైతులు నష్టపోతున్నందున ప్రత్యేక దృష్టితో వెసులుబాటునిచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఆదేశించాలని ఆయన విన్నవించారు.