Cm-kcr-image

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర రావు రైతుల క‌ష్టాలు తెలిసిన వ్య‌క్తి అని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు. ఇవాళ జ‌రిగిన టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. కోటి ఎక‌రాల‌కు నీరందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. గ‌తంలో ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నేత‌లు జేబులు నింపుకున్నార‌ని మంత్రి తెలిపారు. ప్రాణ‌హిత‌కు ప‌ర్మిష‌న్లు లేకుండానే కాల్వ‌లు తవ్వార‌న్నారు. మేడిగ‌డ్డ ద‌గ్గ‌రే నీటి ల‌భ్య‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. అందుకే సీఎం కాళేశ్వ‌రం ప్రాజెక్టు ను రీడిజైన్ చేశార‌న్నారు.

తెలంగాణ ను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌న్నారు. అభివృద్ధి ని ఓర్వ‌లేక‌నే కాంగ్రెస్ విమ‌ర్శ‌లు చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని… కాంగ్రెస్ హాయంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టుల‌న్నీ పూర్తి చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 13 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నీళ్లిస్తున్న‌ద‌ని వివ‌రించారు. ఈ వానాకాలంలో 255 టీఎంసీల నీళ్లు ప్రాణ‌హిత నుంచి స‌ముద్రంలో క‌లిశాయ‌ని అన్నారు. గోదావ‌రి బేసిన్ లో చుక్క‌నీరు శ్రీరాంసాగ‌ర్ కు రాలేద‌ని తెలిపారు.

రైతులు ప‌చ్చ‌గా ఉంటే కాంగ్రెస్ ఓర్వ‌లేక‌పోతున్న‌ద‌న్నారు. ఎస్సారెస్పీ పున‌రుజ్జీవంతో నిజామాబాద్, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌న్నారు. వ‌ట్టిపోయిన ప్రాజెక్టుల‌కు జ‌ల‌క‌ళ తెచ్చేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ద‌న్నారు. అభివృద్ధికి కాంగ్రెస్ నేత‌లు అడుగ‌డుగునా అడ్డుప‌డుతున్నార‌న్నారు. కాంగ్రెస్ కు భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే కృత్రిమ ఉద్యమాలు చేస్తున్న‌ద‌న్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ సంక‌ల్పం ఆగ‌ద‌న్నారు. వ‌చ్చే ఏడాది నుంచి రైతుల‌కు పెట్టుబ‌డి అందిస్తామ‌ని… తెలంగాణ‌లో తొలిసారిగా వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ పెట్ట‌బోతున్నామ‌ని ఆయ‌న తెలియ‌జేశారు. రైతుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డం ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని… ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పున‌రుజ్జీవ ప‌థ‌కాన్ని పూర్తి చేస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు