President

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి రాష్ట్రపతి ప్రధమపౌరుడు. రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరించడంతో పాటు త్రివిధ బలగాలకు అధిపతిగా కొనసాగుతారు. సువిశాలమైన రాష్ట్రపతి భవన్‌ భారత ప్రజాస్వామ్యానికి కీలకంగా ఖ్యాతి గడించింది. దేశంలో కీలక పదవుల నియామకాలు, ప్రభుత్వ ఆదేశాలు, అనుమతులు అన్ని రాష్ట్రపతి ఆమోదంతోనే జరుగుతాయి. రాష్ట్రపతి ఎన్నిక కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పరోక్ష పద్దతిలో ఎన్నిక నిర్వహిస్తారు.

రాష్ట్రపతి ఎన్నిక..
రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్ట్రోరల్‌ కాలేజి ఉంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం విధానసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నామినేటడ్‌ సభ్యులకు ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉండదు.
రాజ్యసభ – 233
లోక్‌సభ – 543
ఎమ్మెల్యేలు (దేశవ్యాప్తంగా)- 4120
మొత్తం ఓటర్ల సంఖ్య – 4896
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓట్లను ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై రాజ్యాంగంలో అన్ని అంశాలను పొందుపరిచారు.సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటును ఇతర ఓటుతో పాటు కలిపి ఒకటిగా పరిగణిస్తారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్ల విలువ మారుతుంది. ఎంపీ ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాను బట్టి మారుతుంది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఉదా: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ జనాభా ఎక్కువగా ఉండటంతో ఓటు విలువ కూడా ఎక్కువే. అదే సమయంలో సిక్కింలో జనాభా తక్కువగా ఉంటుంది. అందుకనే ఓటు విలువ తక్కువే.
మొత్తం ఓట్ల విలువ 10,98,903
ఓటు విలువ అంశానికొస్తే ఎంపీ ఓటు విలువ ఒకటే. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించినా నాగాలాండ్‌ నుంచి ఎన్నికయినా ఎంపీ ఓటు విలువ ఒక్కటే కావడం గమనార్హం. అదే రాష్ట్రాలకు వచ్చేసరికి ఎమ్మెల్యేల ఓటు విలువ జనాభా ఆధారంగా మారుతుంది. మొత్తం ఓట్ల విలువ 10,98,903గా లెక్కిస్తారు. ఇందులో ఎంపీల ఓట్ల విలువ 5,49,408 కాగా ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,495గా ఉంది.

జనాభా ఉన్న రాష్ట్రాల ఓట్లు కీలకం
జనాభాపరంగా పెద్దరాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌బంగా, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌… తదితర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల ఓట్లు విలువ ఎక్కువగా ఉంటుంది.
గతంలో రాష్ట్రపతులుగా ముగ్గురు తెలుగువారు
రాష్ట్రపతి పదవిని గతంలో ముగ్గురు తెలుగువారు నిర్వహించడం విశేషం. తొలి ఉపరాష్ట్రపతిగా ఎంపికైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అనంతరం రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తరువాత వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వహించారు. అపారమైన రాజ్యాంగ పరిజ్ఞానం, న్యాయ అంశాలపై లోతైన అవగాహన ఉండటం రాష్ట్రపతి పదవికి మరింత శోభనిస్తుంది.
కోవింద్‌ ఎన్నిక ఏకపక్షమే..
బిహార్‌లోని అధికార కూటమిలో కీలక భాగస్వామి జనతాదళ్‌ యునైటెడ్‌ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుందని ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్‌ ప్రకటించడంతో ఎన్డీయేకు మరింత బలాన్ని చేకూర్చింది. తమిళనాడులోని అన్నాడీఎంకే వర్గాలు కూడా కోవింద్‌కు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రసమితి సభ్యులు కోవింద్‌కు ఓటు వేస్తారని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ఇదివరకే ప్రకటించారు. ఒడిశా అధికారపక్షం బిజూ జనతాదళ్‌ కూడా ఎన్డీయేకు అనుకూలంగా ఉంది. దీంతో కోవింద్‌ ఎన్నిక ఏకపక్షమే అని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు. యూపీఏ అభ్యర్థిగా లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ పోటీ చేస్తున్నారు.

అందరికి అవకాశం…
దేశంలో అత్యున్నత రాజ్యాంగపదవి రాష్ట్రపతి. ఈ పదవికి ఎన్నికయిన వారిలో ఉత్తరాదివారితో పాటు దక్షిణాదివారు ఉన్నారు. అట్టడుగువర్గాల నుంచి మైనార్టీలకు చెందిన మేధావులు ఈ పదవిని అలంకరించివారిలో ఉండటం మనదేశ ప్రజాస్వామ్య ఔన్యతాన్ని తెలుపుతోంది. 1997లో కేఆర్‌ నారాయణన్‌ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన స్వరాష్ట్రం కేరళ. దళిత వర్గానికి చెందినవారు. తొలిసారిగా దేశంలోని అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిష్టించిన దళితవర్గాలకు చెందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కేఆర్‌ నారాయణన్‌ భారత విదేశాంగ సర్వీసుల్లో సుదీర్ఘకాలం సేవలందించారు. దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం జేఎన్‌యూకు వైస్‌ ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీచేస్తున్న రామ్‌నాథ్‌కు న్యాయకోవిదుడిగా పేరుంది. యూపీఏ తరుఫున పోటీచేస్తున్న మీరాకుమార్‌ కూడా భారత విదేశాంగ శాఖలో పనిచేసి అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. లోక్‌సభకు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2017 ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులిద్దరూ దళిత వర్గాలకు చెందినవారు కావడం విశేషం. రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వరాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌. మీరాకుమార్‌ సొంతరాష్ట్రం బిహార్‌.

ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు..
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. ఒక కూటమి సభ్యుడు మరో కూటమికి చెందిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. దీంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశముంది.

రాష్ట్రపతి రక్షణ బాధ్యతలు
రాష్ట్రపతి రక్షణ బాధ్యతలను భారత సైన్యానికి చెందిన ప్రత్యేకమైన అంగరక్షకుల విభాగం పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌, సిమ్లాల్లో రాష్ట్రపతివిడిది కోసం ప్రత్యేకంగా బంగ్లాలు ఉన్నాయి.