రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి దిశగా అడుగులు
గ్రామ, మండల సమితుల్లో సభ్యత్వం ఖరారు
ఇక జిల్లా, రాష్ట్రస్థాయిలో చోటే ఆలస్యం

రైతు సమన్వయ సమితి (రైసస) రాష్ట్ర అధ్యక్ష పదవి దిశగా లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. పక్కా వ్యూహంతో క్షేత్రస్థాయి నుంచి ఇందుకు రాజకీయ ‘బాట’ వేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో ఆయనకు పొలాలున్నాయి. తాజాగా ఖరారైన ఈ గ్రామ రైససలో గుత్తాకు చోటు దక్కింది. ఈ మండలంలోని అన్ని గ్రామ సమితుల సభ్యుల్లోంచి 24 మందితో మండల సమితిని ఖరారు చేశారు. ఇందులోనూ ఆయన పేరున్నట్లు నల్గొండ జిల్లా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అన్ని మండల సమితుల సభ్యుల్లోంచి జిల్లా రైససకు 24 మంది పేర్లు తెరపైకొచ్చాయి. ఇందులోనూ ఆయనకు చోటివ్వాలని ప్రతిపాదించినట్లు తాజా సమాచారం. మండల సమితుల నియామకంపై వ్యవసాయశాఖ ఉత్తర్వులిచ్చాకే…

జిల్లా సమితి సభ్యుల పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. అప్పటిదాకా గోప్యత పాటిస్తున్నందునే జిల్లా సమితిలో ఆయన పేరును ఎవరూ ధ్రువీకరించట్లేదని సమాచారం. చిట్యాల మండలంలో అన్ని గ్రామ సమితుల సభ్యులను ఎమ్మెల్యే సూచనల ప్రకారమే ఎంపిక చేశారు. రాష్ట్ర సమితి ఛైర్మన్‌ పదవికి గుత్తా పేరు వినపడుతున్నందునే… గ్రామ, మండలస్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా ఆయనకు సభ్యత్వాలు ఇస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. గ్రామ సమితుల సభ్యులతో మండల సమితి, ఈ సభ్యులతో జిల్లా సమితులు ఏర్పడతాయి. తర్వాత జిల్లా రైసస సభ్యుల్లోంచి 42 మందితో రాష్ట్ర సమితిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. జిల్లా సమితి వరకూ గుత్తా పేరు ఉన్నందున, ఇక ఆయన రాష్ట్ర సమితికి రావడమే తరువాయి అని వినిపిస్తోంది.

రేసులో లేకుంటే సభ్యత్వమెందుకు?: నిబంధనల ప్రకారం… వ్యవసాయ పట్టాదారుల్లోంచి 15 మందిని గ్రామ సమితి సభ్యులుగా నియమించాలి. గుత్తా సుఖేందర్‌రెడ్డికి పొలాలున్నందున ఆయనను రైతుగా గుర్తించినా, సమితికి ఎంపిక చేయాల్సిన అవసరంలేదు. రాష్ట్ర ఛైర్మన్‌ పదవికి పోటీపడే ఆలోచనతోనే ఆయన గ్రామ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఏ విషయమూ వెల్లడించడం లేదు.

రాష్ట్రంలో మండల సమితుల నియామకాలకు సంబంధించి ఇంతవరకూ ఒక్క ఉత్తర్వునైనా ఇవ్వలేదు. ఇవి జారీ అయితేనే జిల్లా, రాష్ట్ర సమితుల నియామక అంకం మొదలవుతుంది. జిల్లా సమితులను ప్రకటిస్తే… రాష్ట్ర సమితి పదవుల కోసం పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయన్న ఉద్దేశంతోనే వాటి విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారు. సమితుల నియామకంపై అత్యవసరాదేశాలు తీసుకొచ్చే ప్రయత్నాలేవీ ఇంతవరకూ లేవని, అలాంటి ప్రతిపాదనలను తాము తయారుచేయలేదని వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు.