ఏపీ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయల వైఎస్ సమాధి వద్ద ఓ ఆశ‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విష‌యం ఏంటంటే వైఎస్ స‌మాధి వ‌ద్ద‌ కనిపించిన వ్యక్తుల్లో వైఎస్ కాలంలో చ‌క్రం తిప్పిన ఓ పెద్దాయ‌న‌ సతీమణి ఉండటం విశేషం. వైఎస్ కుటుంబీకులతో కలిసి ఆమె వైఎస్ కు నివాళి ఘటించారు.

సాధారణంగా వైఎస్ కుటుంబంలోని వ్యక్తులు, వైసీపీ నేతలు మాత్రమే కనిపించే ఈ కార్యక్రమంలో కొత్తగా క‌నిపించింది ఎవ‌రో కాదు ఏపీ రాజ‌కీయాల్లో వైఎస్ ఆత్మ‌గా పిల‌వ‌బ‌డే కేవీపీ రామ‌చంద్రారావు సతీమణి. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా కేవీపీ కుటుంబీకులు ఇడుపులపాయ వద్దకు వచ్చిన దాఖలాలు కనిపించ లేదు. అది కూడా కేవీపీ సతీమణి ఇడుపుల పాయకు రావడాన్ని జగన్ మీడియా ప్రత్యేకంగా చూపింది. మరి ఇన్నేళ్లూ దూరదూరంగా ఉంటున్న కార్యక్రమానికి కేవీపీ భార్య హాజరు అవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లకు తెర‌లేపింది.

ఇక ఇటీవ‌ల వైసీపీ త‌రుపున‌ ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా ప్ర‌శాంత్ కిశోర్‌ని జ‌గ‌న్ నియ‌మించుకున్నా సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే న‌వ‌ర‌త్నాలు, మిస్డ్ కాల్‌, వైఎస్సార్ కుటుంబం వంటి కీల‌క ప‌థ‌కాలతో ముందుకు వెళుతున్నా ఎక్క‌డో లోపం జ‌రుగుతోంది. నంద్యాల ఎన్నిక‌.. కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మితో క‌ళ్ళు తెర‌చిన జ‌గ‌న్.. జ‌రిగిన జ‌రుతున్న న‌ష్టానికి స‌రైన పరిష్కారాలు వెదికే ప‌నిలో ఉన్నార‌ని స‌మాచారం. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు రాజకీయంగా పెద్ద దిక్కు లేకుండా అంటూ ఎవ‌రూ లేక‌పోవ‌డం.. పీకేను తెచ్చుకున్నా ఫ‌లితం లేక‌పోవ‌డంతో వైసీపీని గాడిలో పెట్టడానికి స‌రైన టైమ్‌లో స‌ల‌హాలు ఇచ్చేవారికోసం అణ్వేషించ‌గా వారికి కేవీపీ అయితే బాగుంటుంద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్‌తో స‌హా కుటుంబ స‌భ్యులంద‌రూ చ‌ర్చించుకొని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని స‌మాచారం.

గ‌తంలో వైఎస్ కుటుంబానికి, కేవీపీ కి మధ్య సాన్నిహిత్యం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. వైఎస్, కేవీపీ ల మధ్య గల స్నేహం ఈ రెండు కుటుంబాలూ ఒక దశలో ఒకే ఇంట్లో నివసించేలా చేసింది. వైఎస్ సీఎంగా ఉన్నన్ని రోజులూ కేవీపీ వెలిగిన తీరు, వైఎస్ మరణానంతరం సంభవించిన పరిణామాల్లో కేవీపీ తీరు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేవీపీ విష‌యంలో జ‌గ‌న్ కూడా పాజిటీవ్‌గా ఉండ‌డంతో.. హుటాహుటిన ఆయ‌న‌కు క‌బురు పెట్టి వై.ఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జరిగే కార్యక్రమానికి పిలిచారని స‌మాచారం.

వైఎస్ కుటుంబం అంతా ప‌ర్స‌న‌ల్‌గా కేవీపీతో భేటీ అయ్యి ఆయ‌న్ని పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించిందని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కేవీపీకి అన్ని విధాలా హామీలు ఇచ్చాడ‌ట‌. మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు పంపుతామ‌ని, పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏపీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని కూడా చెప్పాడ‌ట‌. దీంతో కేవీపీ కూడా త‌న‌ మ‌నసు మార్చుకున్నార‌ని స‌మాచారం. ఇక ఇదే నిజ‌మై కేవీపీ గ‌నుక వైసీపీలోకి వెళితే ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క మ‌లుపు తిర‌గ‌డం ఖాయ‌మ‌ని.. చంద్ర‌బాబు ఆండ్ బ్యాచ్‌కి మాత్రం వీరి దోస్తితో న‌యా క‌ష్టాల్ షురూ అవుతాయ‌ని విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.