వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని ప్రముఖ నటుడు వేణుమాధవ్ ఆరోపించారు. ఆయన కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నంద్యాలలో టిడిపి తరపున ప్రచారం చేసిన తనను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఈ పని వైసిపి వాళ్లే చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ప్రచారంలో వేణు మాధవ్ వైసిపి నేతలపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

వైసిపి ఎమ్మెల్యే రోజా, పార్టీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రోజా అంటే ‘రో’ యహాసే ‘జా’ (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని, టాటూలు వేసుకుని, చిన్నచిన్న డ్రస్సులు వేసుకుని, డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని ఆయన అన్నారు.

తనకు ఆస్తి, మీడియా లేదన్న జగన్ పైన కూడా వేణు మాధవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తన బిడ్డలతో సమానమైన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల గురించి విమర్శించిన వారి గురించి నేను మాట్లాడటమా… థూ… నీచం, నికృష్టం అని ఓ సందర్భంలో అన్నారు.

మరోసారి, ‘ఒకడేమో నాకు ఛానల్ లేదు.. పేపర్ లేదని అంటున్నాడు.. మరి ఆ ఛానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్’ అంటూ తీవ్ర పదజాలంతో నిలదీశారు.నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తీరుపై టిడిపి మరోసారి ఈసికి ఫిర్యాదు చేసింది. ప్రజలు, ఈసీని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందంటూ ఈసీ ప్రధాన అధికారి భన్వర్ లాల్‌ను ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని కలిశారు.

ఈసీని కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కొనకళ్ల డిమాండ్ చేశారు. డబ్బులు తరలిస్తున్నారంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన వైసిపిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.

వైసీపీ ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే స్పందించారని, తమ ఫిర్యాదుకు నంద్యాలలో హింసను రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేశినేని నాని కోరారు. వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై తాము ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేస్తే మూడ రోజులుగా పట్టించుకోలేదని, రేపటిలోగా స్పందించాలని కోరామన్నారు.