>ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై కాంగ్రెస్ మాజీ సీనియ‌ర్ నాయ‌కులు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మండిప‌డ్డారు. నేను చూసిన రాజ‌కీయ నాయ‌కుల్లో చంద్రబాబు లాగా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్న ముఖ్యమంత్రిని తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. డిసెంబర్ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పురుషోత్తపట్నం ప్రాజెక్టును హడావుడిగా పనులు పూర్తికాకుండానే ఆగస్టు 15న జాతికి అంకితం చేశారని విమర్శించారు. పోలవరం పనులు ఏడాదికి 3 శాతం మాత్రమే జరుగుతున్నాయని.. మరో ఐదేళ్లైనా పోలవరం పూర్తికాదని ఆయన అన్నారు.

ఇక ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు కొన్ని ముఖ్య‌మైన సూచ‌న‌లు చేశారు ఉండ‌వ‌ల్లి. వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు ఎలాంటోడు అయినా ప్ర‌స్తుతం ఆయ‌న ఏపీకి ముఖ్య‌మంత్రి అని.. ప్ర‌తిప‌క్ష అధినేత‌గా జ‌గ‌న్‌ త‌న హుందాత‌నం నిలుపుకోవాలంటే గౌర‌వించాల‌ని .. అంతే కాకుండా వ‌య‌సు రీత్యా పెద్ద‌వారిని గౌర‌వించ‌డం జ‌గ‌న్ నేర్చుకోవాల‌ని.. అలా చేస్తే జ‌గ‌న్‌కే కాదు పార్టీకి కూడా చాలా జ‌రుగుతుంద‌ని.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించగలడని ఆయన అన్నారు.

చంద్రబాబు అనుసురిస్తున్న విధానాలు ఎంతో తప్పని , అయినప్పటికీ ఆయనతో పోలిస్తే చాలా తక్కువ వయసున్న జగన్ విమర్శించేడప్పుడు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎంతటి ప్రత్యర్థి అయినా రాజకీయాల్లో పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వడం చాలా కాలంగా రాజకీయాల్లో వస్తున్న సాంప్రదాయమని ఆయన అన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అవి జ‌గ‌న్‌కు వైసీపీ పార్టీకి మంచిది కాద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు.<