రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తున్నారనే విమర్శకులకు మరో చెంపపెట్టు. జనసేనాని విజ్ఞప్తికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరోసారి సానుకూలంగా స్పందించింది.

తొలుత తమ విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని, పవన్ చెప్పగానే పని అయిపోయిందని విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పవన్ కళ్యాణ్ అంటే అని, ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యమే అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారని, ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని కొందరు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి ఇదే తమ సమాధానం అని అభిమానులు కూడా చెబుతున్నారు. పవన్ ప్రశ్నిస్తే స్పందించడం వెనుక టిడిపికి రాజకీయ కోణం ఉండవచ్చు. కానీ పనులు అవుతున్నాయనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు.

జీవో 64పై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఇటీవల వారు పవన్‌ను కలిశారు. తమ బాధలు వెళ్లబోసుకున్నారు. దీంతో అతడు చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. అనంతరం ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అయితేనే ఇలా సాధిస్తే.. ఫుల్ టైంగా ఉంటే మరెంత సాధిస్తారోనని అభిమానులు అంటున్నారు. పవన్ అనుకుంటే అది జరిగిపోతుందని ఆయనకు విజ్ఞప్తి చేసుకున్న విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

64 జీవోను రద్దు చేస్తున్నట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ విద్యార్థులకు నష్టం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 16 జీవోనే కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 11 కాలేజీల విద్యార్థులు ధర్నా విరమించారని చెప్పారు.

సీఎం చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంపట్ల పవన్‌ హర్షం వ్యక్తం చేశారు. జీవో 64ను రద్దుచేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలిగిందన్నారు. ఇందుకుగాను సీఎం చంద్రబాబు, మంత్రి సోమిరెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అమరావతి భూములు, సుదీర్ఘ కాలంగా ఉన్న ఉద్ధానం తదితర విషయాల్లో పవన్ చొరవ చూపిన విషయం తెలిసిందే. విమర్శకులకు షాక్: పవన్ కళ్యాణ్ మరో విజయం