Nandya;la

బలగాలను మోహరించిన ఇరుపక్షాలు
వ్యూహాత్మకంగా తెదేపా అడుగులు
సర్వశక్తులూ ఒడ్డుతున్న వైకాపా
అందరి దృష్టి నంద్యాలపైనే
ఈనాడు-అమరావతి

నంద్యాల ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఒకే ఒక శాసనసభ స్థానానికి జరుగుతున్న ఎన్నిక అయినప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరో 20 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నంద్యాలలో సానుకూల ఫలితాన్ని రాబట్టాలన్న లక్ష్యంతో రెండు పార్టీలూ బలగాల్ని మోహరించాయి. ఏఒక్క అవకాశాన్నీ వదలకుండా గత కొద్ది వారాలుగా ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి. అధికార తెలుగుదేశం ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికలపై ప్రభావం చూపగలిగిన నాయకుల్ని పార్టీలో చేర్చుకుంది. నోటిఫికేషన్‌కి కాస్త ముందు నుంచే మంత్రులు, సీనియర్‌ శాసనసభ్యులకు ఎన్నికలకు సంబంధించిన నిర్దిష్టమైన బాధ్యతలప్పగించింది. దీనికి ధీటుగా ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా సర్వశక్తులూ ఒడ్డుతోంది. స్వయంగా వైకాపా అధ్యక్షుడు జగన్‌ అక్కడ 13రోజుల పాటు మకాం వేసి విస్తృత రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక ఉప ఎన్నికకు పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఇన్ని రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తుండటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఈ ఉప ఎన్నిక జరుగుతున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

తెదేపా… అభివృద్ధి జపం!
కిందటి ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాల్ని సాధించలేక పోయినప్పటికీ… ఆ తరువాత వివిధ రాజకీయ పరిణామాలతో వైకాపా నుంచి ఏకంగా అయిదుగురు శాసనసభ్యులు చేరడంతో పార్టీపరంగా తెదేపా బలం పుంజుకుంది. దీన్ని మరింత పదిలం చేసుకోవడానికి ఉప ఎన్నిక అవకాశమిచ్చింది. కొద్దివారాల ముందు నుంచీ ఇందులో విజయం సాధించటానికి పక్కా కసరత్తు చేసింది. రెండు సార్లు నంద్యాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఏకంగా రూ.1,500కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణ చరిత్రలో ఈ స్థాయిలో పనులు జరగటం గతంలో ఎన్నడూ ఎరుగనిది. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారుల వెడల్పు నుంచి రికార్డు స్థాయిలో ఒకేసారి 13,000పక్కా ఇళ్ల నిర్మాణం వరకు వివిధ పనులు చేపట్టారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని భరోసా ఇస్తూ… తెదేపా ప్రచారం సాగిస్తోంది. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తితో పాటు మరో అయిదుగురు మంత్రులు ఇక్కడే మకాం వేసి గెలుపు బాధ్యత తీసుకున్నారు. వీరి వ్యూహాలకు అనుగుణంగా… రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 25 మంది ఎమ్మెల్యేలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో సానుభూతికి తోడు అభివృద్ధికిచ్చిన నిధులు విజయానికి దోహదపడతాయని భావిస్తున్నారు. భాజపాతో పొత్తుతో కిందటి ఎన్నికల్లో కాస్త దూరమయ్యారని భావిస్తున్న మైనార్టీలను ఆకర్షించటానికి మాజీ మంత్రి ఫరూక్‌కి శాసనమండలి సభ్యత్వం ఇవ్వగా… మైనార్టీ నేత నౌమన్‌కి ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. మరో మైనార్టీ విద్యాసంస్థల అధిపతి ఇంతియాజ్‌ అహ్మద్‌ని పార్టీలో చేర్చుకున్నారు.

వైకాపా… విమర్శల వెల్లువ
ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రణాళికను అమలు చేయడం లేదంటూ విరుచుకుపడుతోంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగనే ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై పరుషంగా, పదునుగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నుంచి తాఖీదులు అందుకున్నా, తీవ్రమైన ప్రతి విమర్శలకు తావిస్తున్నా వెరవకుండా అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఈ స్థానాన్ని తమ సిట్టింగ్‌ సీటుగా పరిగణిస్తూ… ఉప ఎన్నికల్లో విజయమే రానున్న సాధారణ ఎన్నికల విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నారు. తెదేపా వైపు మైనార్టీలు మొగ్గు చూపకుండా శాసనమండలికి నంద్యాల నుంచి ఒక మైనార్టీకి అవకాశమిస్తామని హామీ ఇచ్చారు. 13 రోజుల విస్తృత ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామాన్నీ, ప్రతి వార్డునూ కనీసం ఒకసారైనా చుట్టి వచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న వర్గాలు, శిల్పా మోహన్‌రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు విజయానికి దోహదపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ బరిలో నిలిచారు. ఈ వర్గం ఓట్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరం.

పూర్వ రంగం!
2014 సాధారణ ఎన్నికల్లో వైకాపా తరఫున విజయం సాధించిన భూమా నాగిరెడ్డి తెదేపాలో చేరడంతో ఈ ప్రాంత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయనపై తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 3,600ఓట్ల తేడాతో ఓడిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి ఈ పరిణామం మింగుడుపడలేదు. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో శిల్పా మోహన్‌రెడ్డితో పాటు భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి కూడా ఇక్కడి నుంచి తెదేపా తరఫున బరిలో నిలవాలని ప్రయత్నించారు. వీరిరువురి మధ్య రాజీ కుదర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి మోహన్‌రెడ్డి వైకాపాలో చేరడంతో ప్రతిష్టాత్మక పోరుకు తెరలేచింది.