నంద్యాల ఉప ఎన్నికలో ఓటమికి జగన్ వ్యాఖ్యలే కారణమని సాక్షాత్తు వైఎస్సార్‌సీపీ ఎంపీ పేర్కోవడం చర్చనీయాంశమైంది. ఉపఎన్నిక‌ ప్రచారం సజావుగా సాగుతోన్నవేళ జ‌గ‌న్ వ్యాఖ్య‌లే చేటుతెచ్చాయని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్ చేసిన వ్యాఖ్యలే తమను ఓడించాయని ఎంపీ మేకపాటి పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఉపఎన్నిక‌లో గెలుపు ఖాయ‌మ‌నుకునే సంద‌ర్భంలో చంద్ర‌బాబు గురించి జగన్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్య‌లు బెడిసి కొట్టాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

”నేను జ‌గ‌న్ ప్ర‌సంగం చూశాను. చాలా ఆక‌ట్టుకునేలా ఉంది. శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డితో స‌భాముఖంగా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయించ‌డం, ఇత‌ర ప్ర‌సంగాలు.. ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుని పోయాయి. కానీ చివ‌ర్లో చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌లతో ఒక్క‌సారిగా క‌థ అడ్డం తిరిగింది..”అంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్ర‌చారంలో తాము ప‌డిన క‌ష్ట‌మంతా, జ‌గ‌న్ వ్యాఖ్య‌ల వ‌ల్లే వృథా అయింద‌ని మేక‌పాటితో పాటు పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు కూడా చర్చించుకుంటున్నట్లు స‌మాచారం. అయితే ఎంపీ రాజమోహన్ రెడ్డి దీని గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారంటూ గతంలో పలుమార్లు ప్రచారం జరిగింది. ఆ ఊహాగానాలను మేకపాటి కూడా ప్రతిసారీ ఖండిస్తూనే వస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేతను ఉద్దేశించి మేకపాటి చేసినా వ్యాఖ్యల్లో అంతరార్థం ఏమిటనే విషయంపై రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీడీపీ, వైసీపీలు ఈ స్థానం కోసం హోరాహోరీగా పోరాడాయి. ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యమే లభిస్తుందని అంచనా వేసినా, టీడీపీ 27 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.