వీసా అక్కర్లేకుండా పనిచేసే సువర్ణావకాశం

ఆ విశ్వవిద్యాలయంలో సీటు రావటాన్ని చాలా అరుదైన విషయంగా చెప్పుకుంటాం. అలాంటిది ఏకంగా పాఠ్యాంశాలు బోధించే సువర్ణావకాశం రావటాన్ని ఇంకెంత ఘనంగా చెప్పుకోవాలి. అలాంటి అరుదైన అవకాశం మన గుంటూరుకు చెందిన యువకుడికి రావటం దేశానికి గర్వకారణం. ప్రపంచంలోనే వైద్యవిద్యకు ఎంతో ప్రఖ్యాతగాంచిన స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయం(స్టాన్‌ఫోర్డు మెడిసిన్‌)లో సహాయ ఆచార్యుడిగా పనిచేసే అదృష్టం గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి డాక్టర్‌ మిక్కినేని కార్తీక్‌కు దక్కింది. గుంటూరు: గుంటూరు వైద్య కళాశాలలో 2004-10 మధ్య యూజీ పూర్తి చేసిన ఆ యువకుడు పీజీ,సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేయటానికి 2012లో అమెరికా వెళ్లారు. 2012 నుంచి 2016 దాకా న్యూయార్క్‌లోని ఫిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ‘వాస్‌క్యూలర్‌ సర్జరీ’ ఎండీ విద్యను పూర్తి చేశారు. వైద్య విద్యలో ఎంతో అసమాన ప్రతిభ కనబరిచిన ఈ యువకుడికి 14 బంగారు పతకాలు వచ్చాయి. మరో 11 ప్రచురణలు అంతర్జాతీయ జర్నళ్లల్లో ప్రచురితమయ్యాయి. వాసిక్యూలర్‌ డిపార్టుమెంట్‌లో మొత్తం 11 సీట్లు ఉంటే అమెరికాయేతర వ్యక్తిగా ఇతనికి మాత్రమే సీటు రాగా మిగిలిన పది మంది అమెరికా దేశానికి చెందినవారే.
‘వాస్‌క్యూలర్‌ సర్జరీ’ సహాయ ఆచార్యుడిగా నియమిస్తూ వర్సిటీ అతనికి శుక్రవారం అధికారిక లేఖను పంపింది. అమెరికాలో ఎలాంటి వీసా లేకుండానే ఉండేందుకు వీలు కల్పిస్తూ అమెరికా ప్రభుత్వం అతనికి మరో సువర్ణావకాశం కల్పించటం ఇక్కడ గమనార్హం. ప్రపంచంలో నోబెల్‌ బహుమతి గ్రహీతలు, అత్యంత అరుదైన వ్యక్తులకు(ఎక్స్‌టార్డినరీ వ్యక్తులు) మాత్రమే అమెరికా ప్రభుత్వం జారీ చేసే ‘ఓ-వన్‌ఏ’ వీసాను స్టాన్‌పోర్టు వర్సిటీ సిఫార్సు మేరకు ఇతనికి జారీ చేయటం విశేషం. ఇప్పటి దాకా స్టాన్‌ఫోర్డు వర్సిటీలో ఈ తరహా వీసాతో భారత సంతతికి చెందిన ఏ ఒక్కరూ పనిచేయలేదని కార్తీక్‌ ‘ఈనాడు’కు వెల్లడించారు. అమెరికాలోనే ఉండి అతను బోధన చేయటం వల్ల వర్సిటీకి, దేశానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించటం వల్లే అతనికి అమెరికా ప్రభుత్వం ఓ-వన్‌ఏ వీసాను జారీ చేసినట్లు తెలుస్తోంది.
రెండు సార్లు ముఖాముఖి..
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో అతన్ని రెండుసార్లు ఇంటర్వ్యూ చేశారు. ఇలా మౌఖిక పరీక్షలు నిర్వహించి వారు సంతృప్తి చెందాకే తన నియామకం వైపు మొగ్గుచూపారని కార్తీక్‌ వివరించారు. ఒకవైపు ఎండీ విద్యాభ్యాసం చేస్తూనే మరో వైపు చదువులో భాగంగానే పరిశోధనల వైపు దృష్టిసారించారు. హార్వర్డ్‌ వర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అతని ప్రతిభను గుర్తించి రెండు రీసెర్చ్‌ ప్రాజెక్టులు మంజూరు చేశాయి. తప్పనిసరిగా ఆ పరిశోధనల ద్వారా వాస్‌క్యూలర్‌ సర్జరీలో విప్లవనాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతానని కార్తీక్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వైద్యంలో ఎంతో ముందుండే అమెరికా వంటి దేశాల్లో గుండె, కిడ్నీ, మోకీలు శస్త్రచికిత్సల ద్వారా శరీరంలో ఎక్కడికక్కడ వాపులు వచ్చి మరణాలు సంభవిస్తున్నాయని, అంత పెద్ద సర్జరీలను సాధ్యమైనంత వరకు చిన్న రంద్రాల ద్వారా చేసేలా తన పరిశోధనలు దోహదం చేస్తాయని కార్తీక్‌ వివరించారు. అమెరికా మొత్తం మీద 3200 మంది మాత్రమే వాస్‌క్యూలర్‌ సర్జన్లు ఉండగా భారత లాంటి అతిపెద్ద దేశాల్లో వీరి సంఖ్య వేళ్లపైనే లెక్కపెట్టవచ్చని చెప్పారు. దేశంలో ఈ వైద్యుల కొరత బాగా ఉంది. మరోవైపు వాస్‌క్యూలర్‌ వైద్యసేవలు అందుకునే బాధితులు నానాటికీ పెరుగుతున్నారు. వీరి సమస్యకు పరిష్కారం చూపాలంటే వాస్‌క్యూలర్‌ సర్జన్ల వైద్యంలో ఎంతో అనుభవం గడించిన స్టాన్‌పోర్డు వర్సిటీ సీనియర్‌ ఆచార్యులతో కలిసి పనిచేయటం వల్ల కొంత పరిణతి వస్తుందన్నారు. అక్టోబరు 1న చేరాలని లేఖ పంపారని బాద్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు తప్పనిసరిగా పనిచేసేలా ఎంఓయూపై సంతకం చేసినట్లు వివరించారు. వార్షికంగా అన్ని రాయితీలతో కలిపి రూ.3.25 లక్షల డాలర్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. మూడేళ్ల అనంతరం ఏపీ రాజదానికి వచ్చి ఇక్కడే వైద్యవిద్య సంస్థను నెలకొల్పి వైద్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తానని కార్తీక్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.