2019 ఎన్నిక‌ల్లో తాము పోటీచేసే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల కోసం కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడిప్పుడే ఆధిప‌త్య పోరు ప్రారంభ‌మ‌వుతుండ‌గా.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు మెల్ల‌గా త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు. రాజ‌కీయం గానేగాక రాజ‌ధాని ప్రాంతంగా మారిన గుంటూరుపై అటు వైసీపీ, ఇటు టీడీపీ పూర్తిగా దృష్టిసారించాయి. బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం వెతుకులాట ప్రారంభించాయి. గుంటూరు ఎంపీ స్థానం నుంచి ఎవ‌రిని పోటీకి దించాల‌నే అంశంపై ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నారు. అయితే సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా ఉండే విద్యాసంస్థ‌ల అధిప‌తి త‌న‌యుడిని ఇక్క‌డి నుంచి పోటీకి దించబోతున్నార‌ని స‌మాచారం!

ప్రముఖ విద్యా సంస్థల అధినేత లావు ర‌త్త‌య్య‌ వారసుడు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు రాజకీయ నాయ‌కుడిగా మార‌బోతున్నా రనే చ‌ర్చ హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాక అత్యంత కీల‌క‌మైన‌ గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఆర్థిక బలం మెండుగా ఉండటంతో ఆయనకే సీటు ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రత్తయ్య గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఎన్నికలకు ముందే పార్టీలో చేరినప్పటికీ పోటీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఇస్తానని పార్టీ అధినేత అప్పట్లో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి రాకపోవటంతో ఆయన ఆశ నెరవేరలేదు.

2014 ఎన్నికలకు చాలా కాలం ముందు గుంటూరు ఎంపీగా టీడీపీ త‌ర‌ఫున రత్తయ్య పోటీచేస్తార‌నే ప్ర‌చారం జోరుగా వినిపించింది. పోటీ చేసేందుకు ఆయన ఇష్టత చూపలేదు. ఆ త‌ర్వాత గ‌ల్లా జ‌య‌దేవ్ తెర‌పైకి వ‌చ్చారు. త‌ర్వాత ర‌త్త‌య్య‌ నరసరావుపేట సీటు ఆశించినట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉండి గుంటూరు ఎంపీగా కొనసాగుతున్న రాయపాటి సాంబశివరావు చకచకా పావులు కదిపి టీడీపీలోకి చేరి నరసరావుపేట లోకసభ స్థానాన్ని దక్కించుకొని విజయకేతనం ఎగురవేశారు. నరసరావుపేట సీటు దక్కలేదనే కోపంతో రత్తయ్య వైసీపీలో చేరారు. పార్టీలో చేరినప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు రత్తయ్య దూరంగా ఉంటూ వచ్చారు.

తండ్రి స్థానంలోకి ఇప్పుడు కొడుకు వ‌చ్చాడు. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే వైసీపీ కార్యక్రమాలకు కృష్ణ‌దేవ‌రాయ‌లు వెళుతున్నారు. ఇక్క‌డి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసిన వల్లభనేని బాలశౌరి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడం కూడా ఆయ‌న‌కు క‌లిసొచ్చింది, అధికారికంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా అయన పేరు ప్రకటించనప్పటకీ సమన్వయకర్త పేరుతో ఇన్‌చార్జిగా చలామణి అవుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా ఆయ‌న బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ ముఖ్య నేతలు ఘంటాపథంగా చెపుతున్నారు. అయితే
లావుర‌త్త‌య్య‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు సన్నిహితుడు కావ‌డం విశేషం!