ఏపీలో కాక‌రేపిన నంద్యాల ఉప ఎన్నిక‌ ఓటమి త‌ర్వాత తొలిసారి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కి జగన్‌ను క‌లిశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి గల కారణాలను పీకే జగన్ కు వివరించారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేంత వరకూ వైసీపీ అనుకూలంగానే ఉందని.., పార్టీ ఇమేజ్ కూడా బాగానే ఉందని, అయితే నేతలు ఓట్లుగా మలచుకోక పోవడం వల్లనే విఫలం చెందామని.. పోలింగ్ కేంద్రాల వారీగా నియోజకవర్గంలో ఉన్న నేతలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే ఓటమి పాలయినట్లు పీకే విశ్లేషించినట్లు సమాచారం.

అంతేకాకుండా అభివృద్ధి నినాదంతో అధికార పార్టీ వెళ్లడం, వైసీపీకి ఓటువేస్తే నంద్యాల అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలు భావించడం, అధికార పార్టీ డబ్బులు విచ్చలవిడిగా పంచడం వల్లనే వైసీపీ ఓటమి పాలయిందని విశ్లేషించారు. నంద్యాలలో మాదిరి జనరల్ ఎన్నికల్లో ఉండదని కూడా పీకే చెప్పినట్లు సమాచారం. దీంతోపాటు వైసీపీ నేతలపై ప్రశాంత్ కిషోర్ జగన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.

ఇక జగన్ పాదయాత్ర వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ 60 రోజుల పాటు కార్యాచరణను వైసీపీ నేతల ముందుంచారు. నియోజకవర్గాల స్థాయిలో నవరత్నాల సభలను ఏర్పాటు చేయడం, వైసీపీ కార్యకర్తల ఇళ్లకు స్టిక్కర్లు అతికించడం వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా జరగడం లేదని ప్రశాంత్ కిషోర్ జగన్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు అసలు నిర్దేశించిన లక్ష్యాన్ని కొందరు పూర్తి చేయడం లేదని ఆరోపించారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడటం కూడా కష్టమేనని చెప్పారు.

పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేతల పేర్లతో కూడిన జాబితాను కూడా పీకే జగన్‌కు ఇచ్చారు. అయితే జగన్ తాను సంబంధిత నేతలతో మాట్లాడతానని పీకే కు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికీ నవరత్నాల పేరుతో కొన్ని నియోజకవర్గాల్లో సభలను నిర్వహించకపోవడాన్ని జగన్ అసంతృప్తి వ్య‌క్తప‌రిచిన‌ట్టు సమాచారం. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత ప్రశాంత్ కిషోర్ తొలిసారి జగన్ తో సమావేశం కావడంతో ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల‌లో హాట్ టాపిక్ అయ్యింది.