ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పరిపాలన, న్యాయ నగరాల్లో నిరుపమాన (ఐకానిక్‌) భవనాలుగా నిర్మించనున్న శాసనభ, హైకోర్టుల ఆకృతులను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రభుత్వానికి అందజేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ప్రాథమిక ఆకృతులు, అంతర్గత నిర్మాణ శైలికి సంబంధించిన ప్రణాళికను ఇందులో పేర్కొంది. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో పరిశీలించారు. శాసనసభ, హైకోర్టు భవనాల అంతర్గత నిర్మాణ ప్రణాళిక బాగుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ శాసనసభ భవనాన్ని వజ్రాకృతిలో, హైకోర్టు భవనాన్ని బౌద్ధ స్థూపాకారంలో డిజైన్‌ చేసింది.

వీటిలో శాసనసభ భవన ఆకృతిని గురువారం శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులకు చూపించి, వారి అభిప్రాయాలు తీసుకున్నాక ఖరారు చేద్దామని చెప్పారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. హైకోర్టు భవనానికి సంబంధించి మరో ఒకటి రెండు ఆకృతులు సిద్ధం చేసుకుని రావాలని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా ఉండాలని తెలిపారు. శాసనసభ, హైకోర్టు నిర్మాణాలు ప్రపంచానికే తలమానికంగా ఉండాలని మొదటి నుంచీ చెబుతున్నానని, అందులో రాజీ పడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. హైకోర్టు భవంతి లోపల ఎలాంటి సౌకర్యాలుండాలో, అంతర్గత నిర్మాణ శైలి ఎలా ఉండాలో హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. బాహ్య ఆకృతి మాత్రం తనతోపాటు, రాష్ట్ర ప్రజలందరూ నచ్చి, మెచ్చేలా ఉండాలని అద్భుతంగా రూపొందించి, తీసుకురావాలని…

వజ్రాకృతిలో శాసనసభ
* శాసనసభ భవనాన్ని 35 ఎకరాల్లో వజ్రాకృతిలో నిర్మిస్తారు. నాలుగు అంతస్తులుగా ఉంటుంది.
* 7.5 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది.
* భవనం ఎత్తు 40 మీటర్లు ఉంటుంది.
* మొదటి అంతస్తును నాలుగు భాగాలుగా రూపొందించారు. మధ్యలో పబ్లిక్‌ ప్లేస్‌కు కేటాయించారు.
* మధ్యభాగం నుంచి పైకి వెళ్లేందుకు వర్తులాకారపు మెట్లు ఉంటాయి. 120 అడుగుల ఎత్తుకి వెళ్లి, అక్కడి నుంచి నగరాన్ని చూడొచ్చు.
* మొదటి అంతస్తును ముఖ్యమంత్రి, మంత్రులు, సభాపతి, పబ్లిక్‌, ప్రెస్‌ కార్యాలయాల కోసం కేటాయించారు
* శాసనసభ, శాసనమండలి కోసం రెండు వేర్వేరు భవనాలు ఈ సముదాయంలోనే అంతర్గతంగా ఉంటాయి.
* 250 సీట్లతో శాసనసభ మందిరాన్ని నిర్మిస్తారు. అవసరమైతే 300 సీట్లకు పెంచుకోవచ్చు.
* 125 సీట్లతో శాసనమండలి మందిరం ఉంటుంది.
* త్రిభుజాకారంలో నిర్మించే బాల్కనీలు శాసనసభ నిర్మాణానికే ముఖ్య అలంకారంగా ఉంటాయి.
* శాసనసభ కింది అంతస్తులోని మధ్య భాగం నుంచి వజ్రాకృతి మొదలవుతుంది. ఇది మొత్తం భవనం పై అంతస్తు వరకూ ఉంటుంది. పై భాగంలో వజ్రాకారం స్పష్టంగా కనిపిస్తుంది
* పై భాగంలో మ్యూజియం ఉంటుంది. ప్రజలందరికీ ప్రవేశం ఉంటుంది.

హైకోర్టు భవనం
* నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ బౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు డిజైన్‌ రూపొందించింది.
* అంతర్గత వసతులు, ప్రణాళికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఏడుగురు సభ్యుల న్యాయమూర్తుల బృందం 95 శాతం సంతృప్తి వ్యక్తం చేసిందని, 5శాతం సూచనలు చేశారని, తుది ఆకృతుల రూపకల్పనలో వాటిని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.
* హైకోర్టు భవనాన్ని 50 ఎకరాల్లో నిర్మిస్తారు. ఆరు అంతస్తులుగా ఉంటుంది.
* 14.5 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుంది.
* 48 కోర్టులుంటాయి. మరో 18 కోర్టులు పెంచుకునే వీలుంటుంది.
* 5వేల మంది పట్టే సామర్థ్యంతో కోర్టుల్ని డిజైన్‌ చేశారు.
సచివాలయ భవనం
మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు 300 నుంచి 400 మీటర్ల దూరంలో వేర్వేరు భవనాల్లో ఉండేలా భవనాల నిర్మాణ ప్రణాళికలు రూపొందించామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. వీటికి సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రెండు ఆప్షన్లతో డిజైన్లు సిద్ధం చేసింది. వీటిపైనా గురువారం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.