నేడు వైకాపా లో చేరనున్న కీలక నేత : రగిలిన అసమ్మతి

రాష్ట్రంలోని వైకాపా నేతలందరూ తెలుగు దేశం వైపు చూస్తోంటే ఆయన మాత్రం వైకపా వైపు చూస్తున్నాడు. ఈరోజు ఏకంగా జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. అనకాపల్లి కీలక నేత, పీసీసీ కార్యదర్శి, తుమ్మపాల షుగర్స్‌ మాజీ చైర్మన్‌ దంతులూరి దిలీప్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్ఠానానికి లేఖ పంపినట్టు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే తన శ్రేయోభిలాషులతో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటానని దిలీప్ తెలిపారు.

అయితే దిలీప్‌కుమార్‌ వైసీపీలోకి చేరనున్నట్టు వైకాప వర్గాల సమాచారం. గురువారం లోటస్ పాండ్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది, ఇప్పటికే ఆయన తన అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం. దిలీప్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత.

అయితే దిలీప్ కుమార్ ని పార్టీ లోకి తీసుకొచ్చే వ్యవహారం పై వైకాపా లో అసమ్మతి చెలరేగినట్టు తెలుస్తోంది. ఇటీవల మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఇటీవల తుమ్మపాలలోని దిలీప్‌కుమార్‌ ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. అయితే దిలీప్‌కుమార్‌ చేరికపై ఇప్పటికే పార్టీలో వున్న కొంతమంది నాయకులు అభ్యంతరం చెబుతూ, తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

దంతులూరి దిలీప్‌కుమార్‌ను వైసీపీలో చేర్చుకోవడాన్ని స్థానిక నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలవాలని పార్టీ నేతలు కొందరు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో వైసీపీ ఇంచార్జీగా గుడివాడ అమర్ వ్యవహరిస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా కూడ అమర్ ఉన్నారు. వైసీపీ నుండి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను బహిష్కరించిన తర్వాత అమర్‌కు వైసీపీ బాధ్యతలను కట్టబెట్టారు.

అనకాపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా దంతులూరి దిలీప్‌కుమార్‌ను వైసీపీలో చేర్చుకానున్నారుీ గుడివాడ అమర్ వ్యవహారశైలి పట్ల స్థానిక పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహావేశాలు ఒకేసారి బహిర్గతమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పార్టీలోకి తమకు గుర్తింపులేని పరిస్థితులుంటే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసేందుకు సైతం వెనుకాడేదని లేదని నియోజకవర్గంలోని పలువురు వైకాపా ముఖ్యనేతలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నేత చేరికతో వైకాపా బలపడనుందా, లేక బలహీన పడనుందా అనేది వేచి చూడాల్సిన విషయం.