గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలై విపక్ష స్థానానికి పరిమితవగా.. ఒక్క కడప జిల్లా మాత్రం ఆ పార్టీ అధినేత జగన్ పరువును కాపాడింది. ఈ జిల్లా నుంచి పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిచి ఎమ్మెల్యే హోదాను దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత సొంత జిల్లా ఎమ్మెల్యేలను కూడా జగన్ కాపాడుకోలేకపోయారు. ఇద్దరు ప్రజా ప్రతినిధులను చేజార్చుకున్నారు. ఇదిలా ఉంటే మారిన రాజకీయ పరిస్థితులతో ఇతర జిల్లాల్లోని 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.

ఈ వలసల గాలి జగన్ సొంత ఇలాకాలోని మరికొంతమంది ఎమ్మెల్యేలపై కూడా సోకనుందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో.. అతి కష్టంమీద కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా జగన్ అడ్డుకట్ట వేయగలిగారు. సొంత జిల్లా ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడితే మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఖాళీ అవుతుందని భావించిన జగన్ కొంత జాగ్రత్తపడిన మాట నిజం. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలో కూడా కడప జిల్లాకు చెందిన జగన్ సైన్యం మొత్తం అక్కడే మకాం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచుల స్థాయి నేతలు కూడా జోరుగా ప్రచారం చేశారు.

తప్పకుండా ఆ సీటు తమదేనని, భారీ మెజార్టీతో గెలుస్తామని, కడప జిల్లాలో కూడా గొప్పులు చెప్పుకున్నారు. కానీ చివరికి వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నంద్యాల ఫలితంతో ఆ పార్టీ నేతలు తీవ్ర షాక్ కు గురయ్యారు. ఇది అంతటితో ఆగలేదు.. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ప్రభావం ఇప్పుడు కడప జిల్లాలోని జగన్ సొంత సైన్యంపై కూడా పడేలా కన్పిస్తోంది. మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్ లో ఉన్న అహంభావం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనను దెబ్బ తీస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కంచుకోట అయిన కడప జిల్లాకు సంబంధించిన ఆ పార్టీ నేతల్లో మరికొంతమంది పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం.