ఏపీలో గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు ఇంట్లో కూర్చుని ప‌నీ పాటా లేకుండా ఉంటోన్న కొంద‌రు నాయ‌కులు, మాజీ మంత్రులు ఇప్పుడు మళ్లీ వార్త‌ల్లోకి ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చాలా మంది మాజీ మంత్రులు వైసీపీలోకి వెళ‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీళ్ల‌లో వ‌ట్టి వ‌సంత్‌కుమార్‌, మ‌నుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి, కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి, కిల్లి కృపారాణి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో మాజీ మంత్రి పేరు కూడా వచ్చి చేరింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. యువకుడు, విద్యావంతుడు అయిన కొండ్రుమురళి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యే, ఆ పై మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న సైలెంట్‌గానే ఉంటున్నారు. తాజాగా నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉంటే లాభం లేదని కొండ్రుమురళి భావిస్తున్నారు. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.

తండ్రిని తిట్టినోడిని జ‌గ‌న్ చేర్చుకుంటాడా..!
వైఎస్ మరణంత తర్వాత కొండ్రు మురళి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని అప్పట్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే మురళి జగన్ పార్టీలోకి వెళ్లేందుకు నిన్న మొన్నటి వరకూ వెనుకాడారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మ‌రి త‌న తండ్రిని దారుణంగా అవ‌మానించిన వ్య‌క్తిని జ‌గ‌న్ త‌న పార్టీలో

చేర్చుకుంటారా ? లేదా ? అన్న‌ది చూడాలి.
వైసీపీకి ఇప్పుడు నాయ‌కుల కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో జ‌గ‌న్ గ‌తాన్ని మ‌ర్చిపోయి ముర‌ళిని పార్టీలో చేర్చుకుంటార‌ని మ‌రో టాక్ వ‌స్తోంది. జ‌గ‌న్ నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చిన వెంట‌నే జగన్ పాదయాత్ర సందర్భంగా శ్రీకాకుళం చేరుకున్నప్పుడు కొండ్రు మురళి పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.