Mastistreet

దిల్లీ: జులై 1 నుంచి నూతన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్‌ 30 అర్ధరాత్రి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో నిర్వహించనున్న జీఎస్‌టీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలా, వద్దా అనే విషయమై కాంగ్రెస్‌ పార్టీ తన నిర్ణయాన్ని గురువారం వెల్లడించనుందని ఆ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ జీఎస్‌టీ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే దానిపై తొలుత బుధవారం నిర్ణయం ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి. గురువారం పార్టీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి దీనిపై చర్చించి… ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఆ పార్టీ ప్రతినిధి తెలిపారు. చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడలను

ఆహ్వానించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. కొత్త పన్ను విధానం ప్రారంభ కార్యక్రమంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కాంగ్రెస్‌ పార్టీకి జైట్లీ సూచించారు. పన్ను వ్యవస్థను సరళీకరించాలని కాంగ్రెస్‌ పార్టీ జీఎస్‌టీని ప్రతిపాదిస్తే, పన్ను టెర్రరిజాన్ని విస్తృత పరిచేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపించాయి.