ఉతికారేసిన ధావన్‌, కోహ్లి
సత్తా చాటిన బౌలర్లు
తొలి వన్డే టీమ్‌ఇండియాదే

శ్రీలంక 13 ఓవర్ల వరకు వికెట్టే కోల్పోకుండా 73 పరుగులు చేసింది. ఓ దశలో స్కోరు 139/1. అలాంటి స్థితి నుంచి ఆ జట్టు కేవలం 77 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కోల్పోయింది. చివరికి 216 పరుగులే చేసింది.
ఇటు భారత్‌ 23 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. కానీ తర్వాత ఒక్కటంటే ఒక్క వికెట్‌ కోల్పోకుండా పరుగుల వరద పారించింది. కేవలం ఒకే ఒక్క వికెట్‌తో 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది.
ఇదీ తొలి వన్డే సాగిన తీరు!
తమ ఆట టెస్టు సిరీస్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉండబోతోందనిపించేలా తొలి వన్డేను ఆరంభించిన లంక.. ఎంతోసేపు ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఒకట్రెండు వికెట్లు పడేవరకు ఓపిగ్గా ఎదురు చూసిన భారత బౌలర్లు.. ఆ తర్వాత ముప్పేట దాడితో లంక బ్యాట్స్‌మెన్‌ పని పట్టారు. ఇక బ్యాటింగ్‌లో ధావన్‌, కోహ్లి అయితే లంకేయులపై అసలేమాత్రం దయ చూపలేదు. మొత్తంగా టెస్టుల్లో కన్నా గట్టిగా తొలి వన్డేలో లంకను దంచి కొట్టింది టీమ్‌ఇండియా.
దంబుల్లా
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన టీమ్‌ఇండియా.. ఐదు వన్డేల సిరీస్‌ను కూడా ఘనవిజయంతో ఆరంభించింది. ఆదివారం తొలి వన్డేలో ఆతిథ్య జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. టెస్టు సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ అదే తరహాలో రెచ్చిపోయాడు. ధావన్‌ (132 నాటౌట్‌; 90 బంతుల్లో 20×4, 3×6)తో పాటు కెప్టెన్‌ కోహ్లి (82 నాటౌట్‌; 70 బంతుల్లో 10×4, 1×6) కూడా రెచ్చిపోవడంతో 218 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 28.5 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు కేదార్‌ జాదవ్‌ (2/26), అక్షర్‌ పటేల్‌ (3/34), చాహల్‌ (2/60), బుమ్రా (2/22)ల ధాటికి లంక 43.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్పకూలింది. టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ డిక్వెలా (64; 74 బంతుల్లో 8×4), గుణతిలక (35), కుశాల్‌ మెండిస్‌ (36) ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసినా.. లంక సద్వినియోగం చేసుకోలేకపోయింది. ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. రెండో వన్డే గురువారం జరుగుతుంది.

బెంబేలెత్తించిన ధావన్‌: బ్యాటింగ్‌లో శుభారంభాన్ని వృథా చేసుకుని తక్కువ స్కోరుకు పరిమితమైన లంక.. బౌలింగ్‌లో మరింతగా నిరాశ పరిచింది. ఆయాచితంగా రోహిత్‌ వికెట్‌ లభించినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. టెస్టు సిరీస్‌లో చెలరేగిన ధావన్‌.. వన్డేకొచ్చేసరికి మరింతగా చెలరేగిపోవడంతో లంక బౌలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కట్టు తప్పిన లంక బౌలింగ్‌ను అతను ఉతికారేశాడు. బౌండరీల మోత మోగిస్తూ 71 బంతుల్లోనే అలవోకగా శతకం బాదేశాడు. అతడిచ్చిన ఒకట్రెండు క్యాచ్‌లను కూడా లంకేయులు చేజార్చారు. లంకపై ధావన్‌కు వరుసగా ఇది 50+ స్కోరు కావడం విశేషం. కోహ్లి కూడా ధాటిగా ఆడటంతో చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది.
ఆ రెండు స్వీప్‌లతో మలుపు..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లంక తొలి పది ఓవర్లలో వికెట్టే కోల్పోకుండా 55 పరుగులు చేసింది. డిక్వెలా, గుణతిలక ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్‌ చేశారు. కొత్త బంతి బౌలర్లు భువనేశ్వర్‌, పాండ్యలను అలవోకగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డిక్వెలా ప్రతి బంతినీ లెగ్‌ సైడ్‌ ఆడుతూ.. అటువైపే బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 13 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 73/0. దీంతో స్కోరు 300 దాటడం ఖాయంగా కనిపించింది. కానీ.. రెండు స్వీప్‌ షాట్లు ఆ జట్టు రాతను మార్చేశాయి. ముందుగా గుణతిలక.. చాహల్‌ బౌలింగ్‌లో ఆడిన రివర్స్‌ స్వీప్‌ తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించింది. అతను రాహుల్‌ చేతికి దొరికిపోయాడు. ఆ తర్వాత డిక్వెలాకు జతకలిసిన కుశాల్‌ మెండిస్‌ ధాటిగా ఆడటంతో లంక ఇన్నింగ్స్‌ బాగానే సాగింది. ఐతే 25వ ఓవర్లో పార్ట్‌టైం స్పిన్నర్‌ కేదార్‌ జాదవ్‌ బంతికి స్వీప్‌ షాట్‌ ఆడబోయిన డిక్వెలా వికెట్ల ముందు దొరికిపోవడంతో ఇన్నింగ్స్‌ మలుపు తిరిగింది. 139/1తో ఉన్న లంక.. ఇంకో 77 పరుగులకే మిగతా 9 వికెట్లూ కోల్పోయింది. స్పిన్నర్లు చాహల్‌, జాదవ్‌, అక్షర్‌ల ముప్పేట దాడికి లంక బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. పేలవ షాట్లు కూడా వారిని దెబ్బ తీశాయి. కెప్టెన్‌ తరంగ (13).. జాదవ్‌ ఫుల్‌ టాస్‌ బంతిని గాల్లోకి లేపి ఔటవడం గమనార్హం. జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనదగ్గ కుశాల్‌ మెండిస్‌ క్రీజులో ఉన్నంతసేపూ మంచి షాట్లే ఆడాడు. అతణ్ని అక్షర్‌ బౌల్డ్‌ చేశాడు. తర్వాత మాథ్యూస్‌ (36 నాటౌట్‌) ఓవైపు పోరాడుతున్నా.. అతడికి సహకరించే వారే కరవయ్యారు. అతణ్ని అటువైపే ఉంచి మిగతా వికెట్లను కూల్చేశారు భారత బౌలర్లు.

23
ధావన్‌ ఇన్నింగ్స్‌లో బౌండరీలు. అతను 20 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. లంక ఇన్నింగ్స్‌లో 20 బౌండరీలే (18 ఫోర్లు, 2 సిక్సర్లు) నమోదయ్యాయి.
ప్చ్‌.. రోహిత్‌!
తొలి వన్డేలో భారత్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌లోనూ లంకేయుల పాత్ర పరిమితం. రోహిత్‌ ఉదాసీనతకు దురదృష్టం కూడా తోడై అతను రనౌటయ్యాడు. పాయింట్‌లోకి బంతిని నెట్టి పరుగు కోసం ప్రయత్నించాడు రోహిత్‌. అతను బ్యాట్‌ను వదులుగా పట్టుకోవడంతో క్రీజుకు కొన్ని అంగుళాల దూరంలో అది చేజారింది. ఇంతలో కపుగెదెర డైరెక్ట్‌ త్రోతో వికెట్లను పడగొట్టాడు. బంతి వికెట్‌ను తాకే సమయానికి రోహిత్‌ పూర్తిగా క్రీజు లోపలే ఉన్నాడు. కానీ అతడి పాదం నేలను తాకేలోపే వికెట్లు లేచిపోయాయి.
శ్రీలంక ఇన్నింగ్స్‌: డిక్వెలా ఎల్బీ (బి) జాదవ్‌ 64; గుణతిలక (సి) రాహుల్‌ (బి) చాహల్‌ 35; కుశాల్‌ (బి) అక్షర్‌ 36; తరంగ (సి) ధావన్‌ (బి) జాదవ్‌ 13; మాథ్యూస్‌ నాటౌట్‌ 36; కపుగెదెర రనౌట్‌ 1; హసరంగ (సి) జాదవ్‌ (బి) అక్షర్‌ 2; తిసార (బి) బుమ్రా 0; సండకాన్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 5; మలింగ (స్టంప్డ్‌) ధోని (బి) చాహల్‌ 8; ఫెర్నాండో (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (43.2 ఓవర్లలో ఆలౌట్‌) 216;
వికెట్ల పతనం: 1-74, 2-139, 3-150, 4-166, 5-169, 6-176, 7-178, 8-187, 9-209;
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 6-0-33-0; హార్దిక్‌ 6-0-35-0; బుమ్రా 6.2-0-22-2; చాహల్‌ 10-0-60-2; కేదార్‌ 5-0-26-2; అక్షర్‌ 10-0-34-3
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ రనౌట్‌ 4; ధావన్‌ నాటౌట్‌ 132; కోహ్లి నాటౌట్‌ 82; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (28.5 ఓవర్లలో ఒక వికెట్‌కు) 220;
వికెట్ల పతనం: 1-23;
బౌలింగ్‌: మలింగ 8-0-52-0; ఫెర్నాండో 6-0-43-0; మాథ్యూస్‌ 2-0-9-0; తిసార 2-0-18-0; సండకాన్‌ 6-0-63-0; హసరంగ 4.5-0-35-0