యుద్ధానికి నిప్పుపెట్టింది ట్రంపే
ఉత్తరకొరియా

అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు చూస్తుంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. వరుస క్షిపణి ప్రయోగాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ఉత్తరకొరియాపై అమెరికా వరుస హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయినా ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా సై అంటే సై అంటూ మాటల దాడికి దిగుతోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే మరో యుద్ధం వస్తుందేమో అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యుద్ధానికి నిప్పు పెట్టింది మాత్రం ట్రంపేనని ఆ దేశం ఆరోపిస్తోంది.

ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హో రష్యా అధికారిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా అణుప్రయోగాలు దేశ ప్రజల శాంతి భద్రతల కోసమే. అయితే ఐక్యరాజ్యసమితి వేదికగా ట్రంప్‌ పిచ్చిపట్టినట్లుగా ఉత్తరకొరియాపై వ్యాఖ్యలు చేశారు. మాపై యుద్ధానికి ఆయనే నిప్పు పెట్టారు. మేం కూడా ఆ యుద్ధానికి మంటలతోనే సమాధానం చెబుతాం. మాటలతో కాదు. అమెరికా శక్తిసామర్థ్యాలతో సరితూగేందుకు మేం సిద్ధమవుతున్నాం. మా లక్ష్యాలను చేరుకోవడంలో మేం చివరి దశలో ఉన్నాం. మా నియమం ఒక్కటే.. మా అణ్వాయుధాల గురించి చర్చలు వస్తే వాటిపై మాట్లాడేందుకు మేం ఎప్పటికీ అంగీకరించం’ అని రి యాంగ్‌ హో అన్నారు.

గత కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వరుస క్షిపణి ప్రయోగాలతో పొరుగు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా ఆగడాలను అరికట్టేందుకు అమెరికా ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పటికే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించేలా ఐరాసలో అమెరికా పెట్టిన తీర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే.