సంబురాల్లో పాల్గొన్న మంత్రుల సతీమణులు
రాష్ట్రమంతటా మహిళల్లో ఆనందోత్సహాలు
బతుకమ్మ ఆడిన యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ హడ్డా

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఘనంగా ఆరంభమయ్యాయి. మంత్రుల సతీమణులు మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఆటపాటలతో వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో తొలిరోజు పండగను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మల సందడి ఉదయం నుంచి ప్రారంభమైంది. తీరొక్క పూలను సేకరించి తెచ్చి మహిళలు గౌరమ్మను పూజించి బతుకమ్మలను పేర్చారు. అనంతరం వారు నింగీనేలా ఏకమయ్యేలా ఆడిపాడారు. హైదరాబాద్‌లోని మంత్రుల ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో మంత్రుల సతీమణులు, కుటుంబీకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ నివాసంలో బతుకమ్మను ఆడారు. తెలంగాణలో గతంలో కంటే ఉత్సాహంగా బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రుల సతీమణులు సి.శ్వేతా లక్ష్మారెడ్డి, ఈటల జమునా రాజేందర్‌, శ్రీనిత హరీశ్‌రావు, పోచారం పుష్పా శ్రీనివాస్‌రెడ్డి, ఈటల కూతురు నీత, కోడలు క్షమిత, కరీంనగర్‌ జడ్పీ ఛైర్మన్‌ తుల ఉమ, మహిళా సహకారసంస్థ ఛైర్మన్‌ గుండు సుధారాణి, హైదరాబాద్‌ మేయర్‌ సతీమణి శ్రీదేవి రామ్మోహన్‌ తదితరులు మంత్రుల ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో మంత్రుల నివాస ప్రాంగణం మార్మోగింది. దాదాపు అయిదు గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం బతుకమ్మలను వారు నిమజ్జనం చేశారు. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా తమ కార్యాలయంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ పండుగ మహిళలను గౌరవిస్తుందని, ప్రకృతిని ఆరాధించాలని ఉద్బోధిస్తుందని తెలిపారు. హన్మకొండలోని పురాతన వేయిస్తంభాల ఆలయ పరిసరాలు పూలసంద్రంగా మారాయి. వేలాదిమంది వనితలు ముచ్చటగా బతుకమ్మలను ముస్తాబుచేసి తీసుకొచ్చి సామూహికంగా సంబురాలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్‌లో బహుజన బతుకమ్మ వేడుకలు: హైదరాబాద్‌లోని ఎల్లమ్మబండ ఫోర్త్‌ఎస్టేట్‌కాలనీలో బహుజన బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మహిళలను ఆడసింహాలుగా తయారుచేసేందుకు బహుజన బతుకమ్మ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ.. బతుకమ్మను అందరూ జరుపుకోవాలంటున్న ప్రభుత్వం నేరెళ్లలో ఆడపడుచులు ఎలా చేసుకోవాలో చెప్పాలన్నారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

‘పర్యాటకులను ఆకట్టుకునేలా బతుకమ్మ వేడుకలు’
జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పర్యాటకులను ఆకట్టుకునేలా బతుకమ్మ పండగను నిర్వహించనున్నట్లు పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం తెలంగాణ ఆహారోత్సవం, బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా, టర్కిష్‌ కాన్సుల్‌ జనరల్‌ అర్ధ ఉలుతాస్‌, పర్యాటకశాఖ ఛైర్మన్‌ పేర్వారం రాములు, పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశంతోపాటు ఆయన సతీమణి గీతాలక్ష్మి, కారంపొడి రెస్టారెంట్‌ నిర్వాహకులు అజయ్‌ కె రామిడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. ఈ సారి బతుకమ్మను పేర్చడానికి వచ్చే వారి సంఖ్య, బతుకమ్మను తీర్చిదిద్దడంలో పాల్గొనే మహిళల సంఖ్య, అత్యంత ఎత్తైన బతుకమ్మను పేర్చడంలాంటి మూడు అంశాల్లో గిన్నిస్‌ రికార్డులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు 25, 26, 27 తేదీల్లో స్పైస్‌ జెట్‌, ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థల విమానాల్లో.. పండగ గురించి వివరించేలా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కేథరిన్‌ బి హడ్డా బతుకమ్మను పేర్చడంతోపాటు పాటలు పాడుతూ మహిళలతో కలిసి నృత్యం చేశారు. కేథరిన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో బతుకమ్మ ఎత్తిన, ఆడిన ఫొటోలను పెట్టి, ‘తెలంగాణ రాష్ట్రంలో ఇది అత్యంత ముఖ్యమైన సంప్రదాయ పండగ.. ఈ పండుగ మహిళలకు, ప్రకృతికి ఎంతో గౌరవం ఇస్తోంది. నాకు ఎంతో నచ్చింది’ అంటూ పోస్ట్‌ చేశారు.