క్యాండీ: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. శనివారం ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే.
]
ఈ టెస్టులో అర్ధశతకం సాధించిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. తొలి రోజు ఆటలో 19.4వ ఓవర్లో లాహిరు కుమార వేసిన బంతిని ఎదుర్కొన్న రాహుల్‌ రెండు పరుగులు చేసి టెస్టు కెరీర్లో 9వ అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇది రాహుల్‌కి వరుసగా 7వ అర్ధశతకం కావడం విశేషం. వరుసగా ఏడు అర్ధశతకాలు (90, 51, 67, 60, 51(నాటౌట్‌), 57, 67(నాటౌట్‌)) సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ఆరో వ్యక్తి. రాహుల్‌ కంటే ముందు ఎవర్టన్‌ వీకీస్‌, ఆండీ ఫ్లవర్‌, శివ్‌నరైన్‌ చంద్రపాల్‌, కుమార సంగక్కర, క్రిస్‌ రోజర్స్‌ ఈ ఘనతను సాధించారు.12brk-80ab

ధావన్‌-రాహుల్‌ రికార్డు భాగస్వామ్యం
గత నాలుగేళ్లల్లో శ్రీలంక గడ్డపై తొలి వికెట్‌కి అజేయంగా 100కు పైగా పరుగులు నమోదు చేసిన రెండో జోడీగా ధావన్‌-రాహుల్‌ నిలిచారు. ఈ ఏడాది ఆరంభంలో గాలెలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో తమీమ్‌ ఇక్బాల్‌-సౌమ్య సర్కార్‌ జోడీ తొలి వికెట్‌కి 118 పరుగులు సాధించింది.
వేగవంతమైన శతకం

ఈ రోజు మ్యాచ్‌లో 17.4 ఓవర్లలోనే భారత జట్టు 100 పరుగులను పూర్తి చేసింది. గతంలో 2010లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన టెస్టులో ఓ ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇంతకంటే తక్కువ ఓవర్లలోనే వంద పరుగులు నమోదు చేసింది. 2001 నుంచి ఇప్పటి వరకు అతి త్వరగా వంద పరుగులు పూర్తి చేయడం ఇది ఆరోసారి.