భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఈ నెల 17న ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం బీసీసీఐ తొలి మూడు వన్డేలకు భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌తో పాటు సురేశ్‌ రైనాకు స్థానం కల్పించలేదు. దీంతో నెటిజన్లు బీసీసీఐపై మండిపడుతున్నారు. మరోసారి యువరాజ్‌ సింగ్‌కు జట్టులో స్థానం కల్పించకపోవడం బాధాకరమని, ఇప్పుడు ఏ కారణం చూపించి అతన్ని ఎంచుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

ఆసీస్‌ లాంటి ప్రత్యర్థితో తలపడేందుకు అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిమానులు అంటున్నారు. ఆర్‌సీబీ జట్టులోని ఆటగాళ్లకే విరాట్‌ ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాడని వారు ఆరోపించారు. కేదార్‌ జాదవ్‌ కంటే రైనా మంచి ఫినిషర్‌ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జట్టు కూర్పు బాగోలేదని.. రైనా లేని జట్టుకు విజయావకాశాలు తక్కువ అని పేర్కొన్నారు.