అశ్విన్‌, జడేజాలకు మళ్లీ విశ్రాంతి
ఆసీస్‌తో తొలి మూడు వన్డేలకు భారత జట్టు

ఆస్ట్రేలియాతో ఈ నెల 17 నుంచి ఆరంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించారు. శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉన్న మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు సెలక్టర్లు విశ్రాంతి కొనసాగించారు. శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా వన్డే అరంగేట్రం చేసిన పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ జట్టులో చోటు కోల్పోయాడు. అతను న్యూజిలాండ్‌తో తలపడుతున్న భారత్‌-ఎ జట్టుకు ఆడనున్నాడు. లంక సిరీస్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్లు చాహల్‌, అక్షర్‌ పటేల్‌లను ఆసీస్‌తో సిరీస్‌కు కొనసాగిస్తున్నట్లు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పాడు.

‘‘రొటేషన్‌ ప్రకారమే ఆస్ట్రేలియా సిరీస్‌కు జట్టును ఎంపిక చేశాం. ఇందులో భాగంగానే అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతినిచ్చాం. అక్షర్‌, చాహల్‌, కుల్‌దీప్‌లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి రిజర్వ్‌ బెంచ్‌ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ప్రసాద్‌ పేర్కొన్నాడు. అశ్విన్‌ ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతుండగా, జడేజా గత నెలలో లంకతో టెస్టు సిరీస్‌ ముగిసినప్పటి నుంచి విశ్రాంతిలోనే ఉన్నాడు. ఆసీస్‌తో తొలి వన్డే 17న చెన్నైలో జరుగుతుంది.

భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌శర్మ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, రాహుల్‌, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, అజింక్య రహానె, ధోని, హర్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి