నన్ను అలా తిడితే గర్వపడతాను
కామెంట్స్‌పై వివ్‌ రిచర్డ్స్‌ కుమార్తె పోస్ట్‌

ముంబయి: దీపావళికి బాణసంచాను నిషేధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయానికి కొందరు మద్దతు పలికితే మరికొందరు బాణసంచా లేకుండా దీపావళి ఎలా చేసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ను ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, వెస్ట్‌ ఇండీస్‌ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌ కుమార్తె మసాబా గుప్తా రీట్వీట్‌ చేశారు.

దాంతో ఆమెను చాలా మంది నెటిజన్లు ద్వేషపూరితమైన కామెంట్లు పెడుతూ తిట్టిపోశారు. నెటిజన్ల కామెంట్లకు దీటుగా సమాధానం చెబుతూ మసాబా ఈ విధంగా ట్వీట్‌ చేశారు. ‘బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతిస్తూ ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాను. దేశంలో ఏ అంశం గురించి మాట్లాడినా నెటిజన్లు కామెంట్స్‌ చేస్తారు. ఈ విషయంలోనూ నాపై ద్వేషపూరిత కామెంట్లు గుప్పించారు.’

‘నన్ను బాస్టర్డ్‌ చైల్డ్‌, అక్రమంగా భారతదేశంలో ఉంటున్న వెస్ట్‌ ఇండియన్‌ మహిళ అని తిట్టారు. మీరు ఈ మాటలు అన్నప్పుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. నేను ఇద్దరు ప్రముఖ సెలబ్రిటీలకు(వివ్‌రిచర్డ్స్‌, నీనా గుప్తా) పుట్టాను. అంతేకాదు స్వయంగా నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మలుచుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నాకు పదేళ్ల వయసున్నప్పటి నుంచి నన్ను ఇలాగే తిడుతున్నారు.’

‘నా ధర్మం నేను చేసే పని, సమాజానికి నేను అందించే సేవల్లోనే ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా నాపై వేలెత్తి చూపే అవకాశం ఉండదు. కాబట్టి నన్ను ఇలాంటి పదాలతో మీరు దూషిస్తే అవి నన్ను మరింత గర్వపడేలా చేస్తాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఇండో-కరీబియన్‌ యువతినైనందుకు గర్వపడుతున్నాను.’ అని పేర్కొన్నారు మసాబా.