పాక్‌లో క్రికెట్‌ సందడి
వరల్డ్‌ ఎలెవన్‌తో పోరులో ఆతిథ్య జట్టు బోణీ

తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించే దిశగా వివిధ జట్లకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన వరల్డ్‌ ఎలెవన్‌తో మూడు టీ20ల ఇండిపెండెన్స్‌ కప్‌కు శ్రీకారం చుట్టిన పాకిస్థాన్‌.. సిరీస్‌లో శుభారంభం చేసింది. లాహోర్‌లో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో పాక్‌.. 20 పరుగుల తేడాతో వరల్డ్‌ ఎలెవన్‌ను ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. బాబర్‌ అజామ్‌ (86; 52 బంతుల్లో 10×4, 2×6), షోయబ్‌ మాలిక్‌ (38; 20 బంతుల్లో 4×4, 2×6), అహ్మద్‌ షెజాద్‌ (39; 34 బంతుల్లో 3×4) మెరుపులతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం వరల్డ్‌ ఎలెవన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులే చేసింది.

ఆ జట్టులో హషీమ్‌ ఆమ్లా (26), టిమ్‌ పైన్‌ (25), డుప్లెసిస్‌ (29) ఇన్నింగ్స్‌లను బాగానే ఆరంభించినా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. చివర్లో డారెన్‌ సామి (29 నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోవడంతో ముందే వరల్డ్‌ ఎలెవన్‌ ఓటమి ఖరారైపోయింది. పాక్‌ బౌలర్లలో సోహైల్‌ ఖాన్‌ (2/28), రయీస్‌ (2/37), షాదాబ్‌ ఖాన్‌ (2/33) రాణించారు. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ స్టార్లు పాక్‌లో మ్యాచ్‌ ఆడటంతో స్టేడియం లోపల, బయట పండగ వాతావరణం నెలకొంది. సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు బుధ, గురు వారాల్లో జరుగుతాయి.