Sasikala

బెంగళూరు శివారు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో బందీగా ఉన్న ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజ వైభవానికి తెరపడింది. అక్కడి అవినీతి, అక్రమాలు రచ్చకెక్కటంతో అధికారులు నియమ పాలన ప్రారంభించారు. సోమవారం నుంచి శశికళ, ఆమె వదిన ఇళవరసి ఖైదీ దుస్తుల్ని ధరించి సాధారణ ఖైదీల్లా మామూలు గదిలో బంధీలుగా కాలాన్ని గడిపారు.

మృష్టాన్న భోజనాలకు బదులుగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పులిహోర, పెరుగన్నం, సాంబారు అన్నం, సంగటి ముద్దనే ఆరగించినట్లు సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం. గత శనివారం వరకూ ఆమెకు చెరసాల్లోని ఒక అంతస్తులో ఐదు గదుల్ని కేటాయించారు. అక్కడ ఆమె సొంత ఇంట్లో మాదిరి సుఖంగా రాజ వైభవాన్ని అనుభవించారు. ఇప్పుడు అది చరిత్రగా మారింది.
ఆదేశాన్ని పాటిస్తాను

‘ఈ వృత్తిలో భావోద్వేగాలకు తావు లేదు. ప్రభుత్వ ఉత్తర్వును పాటిస్తాను’ అని కారాగార విభాగ ఇదివరకటి డీఐజీ, ప్రస్తుత సంచార, రహదారి సురక్షిత విభాగాధికారిణి రూప మౌద్గిల్‌ అన్నారు. మంగళవారం ఇక్కడ నూతన బాధ్యతల్ని చేపట్టిన తర్వాత మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. పరప్పన అగ్రహార చెరసాల అవినీతి, అక్రమాల్ని బహిర్గతం చేసినందుకు పాండిచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి తనను అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

* డీఐజీ రూపాను సంచార, రహదారి సురక్షిత విభాగానికి బదిలీ చేయటం కేవలం బదిలీయే తప్ప శిక్ష కాదని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ రూప్‌కుమార్‌ దత్త మంగళవారం బెంగళూరులో పేర్కొన్నారు సంచార, రహదారి సురక్షిత శాఖ కూడా చాలా ముఖ్యమైనదన్నారు. చెరసాల శాఖ రీలీవ్‌ పత్రంపై ఆమెచే బలవంతంగా సంతకాల్ని చేయించినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. దానికి సంబంధించిన సమాచారం తన వద్ద లేదని చెప్పారు.

* చెరసాల శాఖ స్థితి గతుల్ని అధ్యయనం చేసిన తర్వాత సంస్కరణలకు చర్యల్ని చేపడతామని కారాగార శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మేఘరిక్‌ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నూతన బాధ్యతల్ని చేపట్టిన తర్వాత మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.