36 ఏళ్ల ఫెదరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ కొట్టేశాడు.. 31 ఏళ్ల రఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్లో జెండా ఎగరేశాడు.. 36 ఏళ్ల వయసులో మార్టినా హింగిస్‌ ఒకే గ్రాండ్‌స్లామ్‌లో రెండు టైటిళ్లు కొట్టింది.. ఇక చాలా ఏళ్ల కిందటే 30ల్లోకి అడుగుపెట్టేసిన విలియమ్స్‌ సోదరీమణుల సంగతి చెప్పేదేముంది? ఈ వయసులో ఇలాంటి ఆట ఎలా సాధ్యమవుతోంది.. ఎక్కడి నుంచి వస్తోందీ వీరికీ శక్తి.. ఎలా వస్తోంది వీళ్లకీ వూపు.. జవసత్వాలు కూడగట్టుకుని.. ఆటకు పదునుపెట్టుకుని.. యువతరంతో పోటీపడుతూ మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు కొడుతున్నారీ దిగ్గజాలు. వయసు అంకె మాత్రమే అని నిరూపిస్తూ లేటు వయసులో ఘాటుగా చెలరేగుతున్నారు.

రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌. ఒకప్పుడు ఏ టోర్నీ ఫైనల్లో అయినా వీళ్లిద్దరే. కానీ వయసు పెరిగి, ఫిట్‌నెస్‌ కోల్పోయి, ర్యాంకుల్లో పడిపోయి.. వెనబడిపోయారు అనుకుంటున్న దశలో ఒక్కసారిగా మళ్లీ లేచారు. వయసు పెరిగిందే తప్ప.. చేవ తగ్గలేదని నిరూపిస్తూ 2017 సీజన్లో చెరో రెండు టైటిళ్లు కొట్టి ఔరా అనిపించారు. ఫెదరర్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ గెలవగా, నాదల్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఐదేళ్ల కిందటే 17 గ్రాండ్‌స్లామ్‌లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన ఫెదరర్‌.. మళ్లీ ఈ వయసులో టైటిల్‌ కొడతాడని ఎవరూ వూహించలేదు.. ఫిట్‌నెస్‌ సమస్యలు, యువ కెరటాలతో పోటీ వల్ల రోజర్‌ ఒక దశలో టాప్‌-10లో కూడా చోటు కోల్పోయాడు. కానీ 2017 ఫెదరర్‌ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో చిరకాల ప్రత్యర్థి నాదల్‌ను ఓడించి టైటిల్‌ గెలిచిన ఈ స్విస్‌ యోధుడు.. తనకిష్టమైన వింబుల్డన్‌లోనూ టైటిల్‌ నెగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఒకప్పటి ఫెదదర్‌కు ఇప్పటి రోజర్‌కు ఎంతో తేడా.. ఎంతో పరిణతి. మరెంతో ఉత్సాహం. అతని జోరు ఇప్పటిలో ఆగేలా లేదు. నాదల్‌ కూడా అంతే! గాయాల నుంచి కోలుకుని నెమ్మదిగా ఒక్కో మెట్టూ ఎక్కుతున్న ఈ స్పెయిన్‌ బుల్‌లో పాత దూకుడు లేకపోయినా విజయకాంక్ష మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఫ్రెంచ్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్లు గెలిచిన ఈ స్పెయిన్‌ యోధుడు.. మూడేళ్ల విరామం తర్వాత నంబర్‌వన్‌ ర్యాంకు కూడా చేజిక్కించుకున్నాడు. ఫెదరర్‌, నాదల్‌ కాకుండా పురుషుల సింగిల్స్‌లో 30 ఏళ్లు పైబడ్డాక గ్రాండ్‌స్లామ్‌లు కొట్టిన వాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. సాధారణంగా 28-29 ఏళ్లకు టెన్నిస్‌ క్రీడాకారులు అత్యుత్తమ దశలో ఉంటారని, ఆ తర్వాత జోరు తగ్గుతుందన్నది నిపుణుల మాట. ఐతే ఆ వయసును దాటేసిన రోజర్‌, రఫా లేటు వయసులో కొత్త ప్రమాణాల్ని నెలకొల్పుతున్నారు. ఆధునిక టెన్నిస్‌ దిగ్గజాలు పీట్‌ సంప్రాస్‌, ఆండ్రీ అగస్సీ కూడా 35 ఏళ్లలోపే కెరీర్‌ ముగించారు. మరి ఫెదరర్‌-నాదల్‌ ఎందాక వెళతారో చూడాలి.
4
ఈ ఏడాది ఫెదరర్‌, నాదల్‌ పంచుకున్న టైటిళ్లు. వీరు చెరో రెండు ట్రోఫీలు ఖాతాలో వేసుకున్నారు.
10
పునరాగమనంలో హింగిస్‌ సాధించిన మిక్స్‌డ్‌ డబుల్స్‌, డబుల్స్‌ టైటిళ్లు

అక్కాచెల్లెళ్లు కూడా..
దశాబ్దం కిందట ఏ టోర్నీ ఫైనల్లో చూసినా వీనస్‌ విలియమ్స్‌, సెరెనా విలియమ్స్‌లే. కాల క్రమేణా వీనస్‌ ప్రభావం తగ్గినా.. సెరెనా ఇంకా జోరు కొనసాగించింది. టైటిళ్లు కొడుతూనే సాగింది. ఐతే 37 ఏళ్ల వీనస్‌, 35 ఏళ్ల సెరెనా.. ఈ వయసులో ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు వెళతారని కలలో కూడా వూహించలేదు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ అరుదైన దృశ్యమే చూశాం. ఆ ఫైనల్లో అక్కా మీద చెల్లి సెరెనాదే పైచేయి అయింది. బిడ్డకు జన్మనివ్వడంతో సెరెనా టెన్నిస్‌కు కొన్నాళ్లు విరామం తీసుకున్నా.. వీనస్‌ మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ఫైనల్‌ చేరిన ఆమె.. వింబుల్డన్‌లోనూ తుది సమరానికి అర్హత సాధించింది. యుఎస్‌ ఓపెన్లో సెమీస్‌ వరకు వచ్చింది. దిగ్గజ క్రీడాకారిణి బిల్లీ జీన్‌ కింగ్‌ 39 ఏళ్ల వయసులో తన కెరీర్‌లో ఆఖరి టైటిల్‌ సాధించింది. మార్టినా నవ్రతిలోవా 37 ఏళ్ల వయసులోనూ సత్తా చాటింది. మరి వీనస్‌, సెరెనా ఏ వయసులో చివరి టైటిల్‌ కొడతారో చూడాలి. ఓపెన్‌ శకంలో అత్యధిక టైటిళ్లు (23) తన ఖాతాలో వేసుకున్న సెరెనా.. తల్లి కావడంతో విశ్రాంతిలో ఉంది. స్లోన్‌ స్టీఫెన్స్‌ లాంటి అమ్మాయిలు అదరగొడుతున్న తరుణంలో పునరాగమనంలో ఆమె ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.

నయా హింగిస్‌
వీళ్లందరితో పోలిస్తే మార్టినా హింగిస్‌ కథ భిన్నం. సింగిల్స్‌లో ఒక వెలుగు వెలిగి.. టెన్నిస్‌కు టాటా చెప్పేసి ఈ స్విస్‌ భామ.. కొన్నేళ్ల విరామం తర్వాత డబుల్స్‌లోకి వచ్చింది. ఇటు మహిళల డబుల్స్‌, అటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆమె అదరగొట్టేస్తోంది. ఏడాది క్రితం వరకు సానియా తోడుగా డబుల్స్‌లో రికార్డు స్థాయిలో విజయాలు సాధించిన హింగిస్‌.. భారత దిగ్గజం లియాండర్‌ పేస్‌ జతగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టైటిళ్లు కొట్టింది. తాజాగా యుఎస్‌ ఓపెన్లో 36 ఏళ్ల హింగిస్‌.. జామి ముర్రేతో మిక్స్‌డ్‌ డబుల్స్‌, చెన్‌యంగ్‌తో మహిళల డబుల్స్‌ టైటిళ్లు సొంతం చేసుకుంది. పునరాగమనంలో మార్టినా 5 మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిళ్లు.. 5 డబుల్స్‌ టైటిళ్లు సాధించడం విశేషం. జోరు మీదున్న హింగిస్‌ మరిన్ని ట్రోఫీలు ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.