ప్రొకబడ్డీ మ్యాచులకు రిఫరీగా…

దిల్లీ: ఎందరో కలలు కనే పోలీసు ఉద్యోగాన్ని వదులుకుని తనకు ఇష్టమైన ఆటలో రిఫరీగా స్థిరపడింది… బెంగళూరుకు చెందిన జమున వేంకటేశ్‌. ప్రొకబడ్డీ సీజన్‌ ప్రారంభం నుంచి ఆమె రిఫరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. జమున గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఆమె మాటల్లోనే..
‘నేను కబడ్డీ క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చాను. నా భర్త కూడా కబడ్డీ ఆడేవారు. ఇప్పుడు నా కుమార్తె కూడా కబడ్డీ ఆడుతోంది. రిఫరీగా మారక ముందు నేను కబడ్డీ ఆడుతూ ఉండేదాన్ని. కొన్ని కారణాల వల్ల ఆడటం మానేశాను. కానీ నా భర్త ఇచ్చిన మద్దతుతో ఇప్పుడు రిఫరీగా స్థిరపడ్డాను. ఆయన ప్రస్తుతం పోలీసు ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. కానీ, కబడ్డీ మీద ఉన్న మక్కువతో దాన్ని వదిలేశాను. కబడ్డీలో రిఫరీగా పని చేయడం ఎంతో కష్టతరమైంది. క్రీడాకారులకు న్యాయం చేయాలి అంటే మనం 100శాతం కష్టపడాలి’ అని జమున తెలిపారు.

‘భవిష్యత్తులో మహిళలు కబడ్డీ క్రీడకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు కబడ్డీ ఆడుతున్నారు. వారి వారి కుటుంబాల నుంచి అమ్మాయిలకు మద్దతు లభిస్తే అతి త్వరలోనే మనం పురుష కబడ్డీ జట్టుతో సమానంగా మహిళల జట్టును చూడొచ్చు.’ అని జమున ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో 2009లో మలేసియాలో నిర్వహించిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీకి, 2012లో పట్నాలో నిర్వహించిన మహిళల
ప్రపంచకప్‌ పోటీలకు జమున రిఫరీగా పనిచేశారు.