ఇంకో ఐదేళ్లు కెప్టెన్‌గా కోహ్లీనే
ధోని ప్రదర్శన ట్రైలర్‌ మాత్రమే
ప్రతిసారీ అశ్విన్‌, జడేజాలతో ఆడలేం
ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అందుకుంటేనే చోటు

18 నెలల పాటు టీమ్‌ఇండియా డైరెక్టర్‌గా మంచి పని తీరు కనబరిచినప్పటికీ తనను గత ఏడాది కోచ్‌ పదవికి ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించిందని రవిశాస్త్రి అన్నాడు. తాను ఈ ఏడాది కోచ్‌గా జట్టులోకి రాగానే ఆటగాళ్లు సంతోషించారని అతను చెప్పాడు. యువరాజ్‌ సింగ్‌పై వేటు పడటంపై స్పందిస్తూ.. ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అందుకోకుంటే చోటు కష్టమే అన్నాడు రవిశాస్త్రి. అశ్విన్‌, జడేజాలకు వరుసగా విశ్రాంతి ఇస్తుండటంపై, ధోని భవిష్యత్తుపై, కోహ్లి కెప్టెన్సీపై.. ఇంకా అనేక విషయాలపై ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాల్ని చెప్పాడు రవి. ఆ ఇంటర్వ్యూ విశేషాలివీ..

శ్రీలంకలో ఆడిన 9 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా విజయాన్ని ఎలా అభివర్ణిస్తారు?
శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియా విజయం కుర్రాళ్ల ఘనతే. పర్యటన ఆసాంతం ఆటగాళ్లలో గెలవాలన్న ఆకలి, కసి కనిపించాయి. అందరూ అత్యుత్తమంగా ఆడారు. మొత్తం పర్యటనలో విఫలమైన ఆటగాడు ఒక్కడూ లేడు. జట్టు ఫామ్‌లో ఉన్నప్పుడు అదే ప్రదర్శన కొనసాగించడం కీలకం. ప్రతి మ్యాచ్‌లో ఆరేడుగురు నిలకడగా రాణించడం గొప్ప విషయం.

కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం ఎలా అనిపించింది?
18 నెలలు టీమ్‌ఇండియా డైరెక్టర్‌గా పనిచేసినా.. 2016లో కోచ్‌గా ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించింది. చీఫ్‌ కోచ్‌గా తిరిగి రాగానే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతి ఒక్కరిలో ఆనందం కనిపించింది. ఆటగాళ్లలో ఎలాంటి మార్పులేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌ ఎలా ఉండాలో.. వాళ్లెలా ఉండాలని నేను కోరుకుంటానో ఆటగాళ్లందరికీ తెలుసు. ఒకరిద్దరు క్రికెటర్లు కొత్తగా వచ్చుంటారంతే. జట్టు డైరెక్టర్‌గా దిగిపోవడానికి, మళ్లీ చీఫ్‌ కోచ్‌ పదవి చేపట్టడానికి మధ్య విరామం ఎక్కువగా లేకపోవడం కలిసొచ్చింది. డైరెక్టర్‌గా పని చేసినప్పుడు ఒక వ్యవస్థను నిర్మించుకున్నా. సహాయక సిబ్బందితో కలిసి పని చేశా. వారి కొనసాగింపు అవసరమనిపించింది. అందుకే కోచ్‌గా ఎంపికయ్యాక మళ్లీ నా బృందాన్ని తీసుకున్నా. సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరినీ నేనే ఎంపిక చేసుకున్నా.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో కెప్టెన్‌, కోచ్‌ మాట్లాడుకోకపోవడాన్ని ఎలా విశ్లేషిస్తారు?
ముక్కుసూటిగా ఉండటం నాకు అలవాటు. గతంలోకి వెళ్లదల్చుకోలేదు. ఏం జరిగిందో కూడా అనవసరం. ప్రస్తుతంలో ఉండటమే నాకిష్టం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో అడుగుపెట్టగానే ఇప్పుడేంటి అన్నదే నా ఆలోచన. ప్రస్తుతంలో జీవిస్తూ భవిష్యత్తు లక్ష్యాల్ని నిర్దేశించుకుంటా.

జట్టుకు నాయకుడే సుప్రీం అన్న వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడతారా?
జట్టులో కెప్టెనే బాస్‌. అతడే ఇన్‌ఛార్జ్‌. బౌండరీ లైన్‌ ఆవలి వరకే ఎవరి సలహాలైనా. కోచ్‌ ఏమైనా చెప్పొచ్చు. కానీ మైదానంలో దిగితే నాయకుడే అన్నీ. టెస్టుల్లో సమయం ఉంటుంది. వన్డేల్లో తక్కువ. టీ20ల్లో సమయమే ఉండదు. మైదానంలో ఏ నిర్ణయమైనా అతనే తీసుకోవాలి. జట్టు గెలిచినా.. ఓడినా అతడే బాధ్యత తీసుకుంటాడు.

2019 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ధోని ఉన్నాడా?
ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ ధోనీనే. అందరి కంటే వేగంగా పరుగెత్తగలడు కూడా. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ధోనీకి లాభించింది. వన్డేలకు మరింత ఫిట్‌గా.. ఉత్సాహంగా ఉండేందుకు ఈ నిర్ణయం పనికొచ్చింది. టీమ్‌ఇండియాకు అతను తిరుగులేని ఆస్తి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోని పెద్దన్నలాంటోడు. ఆటలో అపార జ్ఞానం అతని సొంతం. శ్రీలంకలో ధోని ప్రదర్శన ట్రైలర్‌ మాత్రమే. ధోనీ అసలు ఆటను మున్ముందు చూస్తారు.

ఒకప్పటి డైరెక్టర్‌గా, ప్రస్తుత కోచ్‌గా విరాట్‌ కోహ్లిని మీరెలా విశ్లేషిస్తారు?
ఆటగాడిగా, సారథిగా విరాట్‌ ఎంతో ఎదిగాడు. పరిణతి సాధించాడు. కొండంత ఆత్మవిశ్వాసం అతడి సొంతం. జట్టులో ప్రతి ఒక్కరు అతణ్ని గౌరవిస్తారు. పని పట్ల కోహ్లి నిబద్ధతను భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతి ఒక్కరు అనుకరించేందుకు ప్రయత్నిస్తారు. జట్టును అతను ముందుండి నడిపిస్తాడు. కోహ్లి సారథ్యంలో టీమ్‌ఇండియా శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై సిరీస్‌ విజయాలు సాధించింది. అతడి స్థానంలో ఉన్న వారికి సాకులు వెతికే అవకాశం లేదు. కెప్టెన్‌గా కోహ్లి అద్భుతాలు చేయడం ఖాయం. కనీసం మరో ఐదారేళ్లు సారథిగా అతడి స్థానం సుస్థిరం. నాయకుడిగా కోహ్లి ఇప్పటికే ఎన్నో సాధించాడు. రానున్న మూడేళ్ళలో విరాట్‌ అంటే ఏంటో చూస్తారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అశ్విన్‌, జడేజాలను ఎంపిక చేయకపోవడానికి కారణమేంటి? ప్రపంచకప్‌ జట్టులో వారుంటారా?
అశ్విన్‌, జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ల జాబితాలో ఉంటారు. ప్రతిసారి వాళ్లతో ఆడలేం. టీమ్‌ఇండియా తొలి ప్రాధాన్యం టెస్టు క్రికెట్‌కే. రానున్న రోజుల్లో చాలా టెస్టు సిరీస్‌లు ఉన్నాయి. ఆ సిరీస్‌లకు అశ్విన్‌, జడేజాలను ఫిట్‌గా ఉంచుకోవడం ముఖ్యం. ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ళ సమయముంది. జట్టులోకొచ్చేందుకు అశ్విన్‌, జడేజాలకు చాలినంత సమయముంది.

2019 ప్రపంచకప్‌ నేపథ్యంలో ధోని, యువరాజ్‌లపై ఓ నిర్ణయం తీసుకోవాలని ద్రవిడ్‌ అన్నాడు. దులీప్‌ ట్రోఫీలో 3 జట్లలో యువీ పేరే లేదు. అతడి పనైపోయినట్లేనా?
నేను సెలెక్టర్‌ను కాదు. అత్యుత్తమ ఫీల్డింగ్‌ జట్టు ఉండాలన్నది మా అభిమతం. టీమ్‌ఇండియా జట్టు ఎంపికకు కొన్ని ప్రమాణాలున్నాయి. ఆ ప్రమాణాలు ఉన్నవాళ్లంతా జట్టు ఎంపికకు అర్హులే. ఆ తర్వాత జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫామ్‌ పరిగణలోకి వస్తాయి. జట్టు ఎంపికకు ఇవే గీటురాళ్లు. యువరాజ్‌ గురించి సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కాంట్రాక్టు ఆటగాళ్లంతా టీమ్‌ఇండియా ప్రమాణాలు అందుకోవాల్సిందే. ఫామ్‌ మాత్రమే ఆటగాళ్ల చేతుల్లోనే ఉంటుంది. గత రెండు, మూడేళ్లుగా సెలెక్టర్ల పనితీరు గొప్పగా ఉంది.

‘‘ధోని ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌ బాగున్నాయి. వన్డేల్లో అతడు అత్యుత్తమ వికెట్‌కీపర్‌. శ్రీలంకలో చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. లంకలో ధోని ఆట ట్రైలర్‌ మాత్రమే. సినిమా ముందుంది. అతడి ఫామ్‌ ఇలాగే ఉంటే 2019 ప్రపంచకప్‌లో తప్పక ఉంటాడు. ధోని లేని జట్టును వూహించలేం’’