ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమా?.. ప్రమాదం జరిగిన తీరు గురించి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలను బట్టిచూస్తే అవుననే అనాల్సివస్తోంది. ముజఫర్‌నగర్‌కు 40 కి.మీ దూరంలోని ఖతౌలీ వద్ద పూరీ-హరిద్వార్‌ కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందగా, 400 మందికిపైగా గాయపడ్డారు. 14 బోగీలు పట్టాలు తప్పాయి. పలు బోగీలు రైల్వే ట్రాక్‌ సమీపంలోని నివాసాల్లోకి దూసుకెళ్లాయి. ఘటనాప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు.

అయితే ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని స్థానికులు పేర్కొంటున్నారు. రైలు బోగీ దూసుకెళ్లడంతో స్థానికంగా నివసించే జగత్‌ రామ్‌ నివాసం దెబ్బతింది. ఈ ఘటనపై జగత్‌ స్పందిస్తూ.. ‘గత రెండు రోజులుగా ఇక్కడ రైలు పట్టాలకు మరమ్మతులు చేస్తున్నారు. అయితే ఈ మరమ్మతుల గురించి ప్రమాదానికి గురైన ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌కు సమాచారం లేకపోయి ఉండొచ్చు.. ఇదే ప్రమాదానికి కారణమై ఉంటుంది.’ అని తెలిపాడు. ‘ఈ ప్రమాదానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన రెండు రైళ్లు ఇక్కడికి రాగానే నెమ్మదిగా వెళ్లాయి. అయితే ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం వేగంగా దూసుకొచ్చి పట్టాలు తప్పింది’ అని జగత్‌ చెప్పాడు. పలువురు ప్రత్యక్ష సాక్షులు ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు

ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదం వెనక ఉగ్రవాద కోణమేదైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. యూపీ ఉగ్రవాద వ్యతిరేక దళం అన్ని కోణాలనూ పరిశీలిస్తోందని అదనపు డీజీ తెలిపారు. మరోవైపు ఏదైనా లోపాల వల్ల ప్రమాదం జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు వెల్లడించారు.