అనుమతి లేకుండానే పట్టాలపై నిర్వహణ పనులు..!?
యూపీ రైలు ప్రమాదంపై నేటి నుంచి విచారణ
తుక్కుగా మారిన ఆరు పెట్టెలు
మృతుల సంఖ్య 22…మరింత పెరిగే అవకాశం
ముజఫర్‌నగర్‌/ దిల్లీ

పూరీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురి కావడానికి కారణం సిబ్బంది నిర్లక్ష్యమేనా అనే అనుమానం బలపడుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, కారణాలను నిగ్గు తేల్చడానికి రైల్వే మంత్రిత్వశాఖ రంగంలో దిగింది. రైల్వే భద్రత కమిషనర్‌ శైలేష్‌కుమార్‌ పాఠక్‌ నేతృత్వంలో సోమవారం నుంచి దర్యాప్తు మొదలు కానుంది. ముజఫర్‌నగర్‌కు సమీపంలోని ఖతౌలీ స్టేషన్‌ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రాణాలు కోల్పోయినవారు 22మంది కాగా, 156 మంది గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారనీ, వారిలో 26 మందికి తీవ్రంగా గాయాలయ్యాయనీ అధికార వర్గాలు ఆదివారం వివరించాయి. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉందని యూపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(సమాచార విభాగం) అవినాశ్‌ కుమార్‌ అవస్థి ఒక వార్తా సంస్థకు తెలిపారు. దెబ్బతిన్న రైలుమార్గం పునరుద్ధరణఆదివారం రాత్రికి పూర్తయింది. రైలు పట్టాలపై నిర్వహణ పనులు జరుగుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోందనీ, అవి ఏమిటనేది స్పష్టతలేదనీ రైల్వేబోర్డు సభ్యుడు మహ్మద్‌ జంషెడ్‌ దిల్లీలో విలేకరులకు చెప్పారు. అనుమతి లేకుండా నిర్వహణ పనులు చేపట్టారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఇ-టికెట్‌ కింద 40%మందికి బీమా వర్తిస్తుందనీ, ఇది కాకుండా రైల్వే కూడా పరిహారం చెల్లిస్తుందని చెప్పారు. ‘సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు పెట్టెలు బోల్తాపడడం, పట్టాలు తప్పడం, ధ్వంసం కావడం వంటివి జరుగుతాయి. ఈ ఘటనలో 200 మీటర్ల మేర పట్టాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమగ్రంగా విచారణ జరపాలి. అన్ని లెక్కలూ తేల్చి, ప్రతీ వైఫల్యాన్ని పరిగణనలో తీసుకుంటాం’అని జంషెడ్‌ వివరించారు.
సవాల్‌ విసిరిన పునరుద్ధరణ పనులు: పట్టాలు తప్పిన 14 పెట్టెల్లో 6 ఘోరంగా దెబ్బతిని, తుక్కుగా మిగిలాయి. వాటిని పట్టాలపైనుంచి తొలగించే పనులూ ఒక పట్టాన పూర్తికాలేదు. అధునాతన 140 టన్నుల క్రేన్లను, పెద్దఎత్తున కూలీలను రంగంలో దించి 24 గంటలకు పైగా కష్టపడితే గానీ శకలాలను తొలగించలేకపోయారు. ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైనప్పుడు గంటకు 100 కి.మీ. వేగంతో వెళ్తొందని దిల్లీ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌.ఎన్‌.సింగ్‌ వెల్లడించారు. రైల్లో 23 పెట్టెలు ఉంటే వాటిలో 13 పట్టాలు తప్పాయని తెలిపారు. జాతీయ విపత్తు ఉపశమన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సహకారంతో చేపట్టిన సహాయక చర్యలు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పూర్తికాగా ఆ తర్వాత రైలుమార్గం పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
బాధ్యుల్ని నిర్ణయించండి: సురేశ్‌ ప్రభు
యూపీలో ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన ఘటనకు బాధ్యుల్ని వెంటనే నిర్ణయించాలని రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ఆదివారం రైల్వేబోర్డు ఛైర్మన్‌ను ఆదేశించారు. వైఫల్యం ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు.
పోలీసు కేసు నమోదు
ఉత్కళ్‌ ప్రమాదంపై ఖతౌలీ ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు. యంత్రాలను నిర్లక్ష్యంగా వదిలేయడం(సెక్షన్‌ 287), తమ చర్యలతో ఇతరుల ప్రాణాలకు ప్రమాదం తీసుకురావడం (సెక్షన్‌ 337), నిర్లక్ష్యంతో ప్రాణనష్టానికి కారణమవడం నేరాల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది.