మూడు నెలల్లో 1.25 లక్షల మంది బాధితులు
జలుబు, దగ్గు, గొంతునొప్పితోనూ సతమతం
స్వైన్‌ ఫ్లూ అనుమానంతో ఆసుపత్రులకు పరుగులు
రాష్ట్ర వ్యాప్తంగా కిటకిటలాడుతున్న దవాఖానాలు
వాతావరణ మార్పులే కారణం
అంటున్న వైద్య నిపుణులు

 హైదరాబాద్‌: తెలంగాణలో కాలానుగుణ (సీజనల్‌) వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. వారం రోజుల్లో హైదరాబాద్‌లోని ఫీవర్‌, గాంధీ ఆసుపత్రులకొచ్చే రోగుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. సోమవారం ఒక్క గాంధీ ఓపీకే సుమారు 4 వేల మంది, మంగళవారం మరో 3,628 మంది రోగులొచ్చారు. వీరిలో దాదాపు సగం మంది జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వర లక్షణాలతో బాధపడుతున్నవారేనని వైద్య వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్‌లో అత్యధికంగా…
వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం- గత మూడు నెలల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 9,758 మంది వైరల్‌ జ్వర పీడితులు నమోదయ్యారు. ఆసిఫాబాద్‌ కుమురం భీం(7,701), జయశంకర్‌ భూపాలపల్లి(5,728), కొత్తగూడెం భద్రాద్రి(6,914), ఖమ్మం(5,126), మంచిర్యాల (6,319), మహబూబాబాద్‌(8,164), నల్గొండ (9,694), నిర్మల్‌(5,265), సంగారెడ్డి(7,081), సిద్దిపేట(7,083), సూర్యాపేట(6,742), యాద్రాద్రి (5,396) జిల్లాల్లోనూ ఐదు వేలకు తక్కువ కాకుండా రోగులు ఆసుపత్రులకు వచ్చారు. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,393 మంది జ్వరగ్రస్థులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందారు. ఇవన్నీ సర్కారు గణాంకాలు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, క్లీనిక్‌ల్లో చికిత్స పొందినవారి సంఖ్య దీనికి కనీసం మూడింతలు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వానలు తరచూ కురుస్తుండటం; వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయనీ… గతంలో మూణ్నాలుగు రోజులు తీవ్రంగా బాధించిన ఈ ఉష్ణవ్యాధులు ఇప్పుడు ఐదారు రోజుల వరకూ వీడటం లేదంటున్నారు వైద్యులు. వీటి విషయంలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం మేలంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనా ఎండ తీవ్రత తగ్గట్లేదు. రాష్ట్రంలో 36-37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పటికప్పుడే వర్షాలు కురుస్తుండటంతో ఉన్నట్టుండి కొద్దిరోజుల పాటు వాతావరణం చల్లబడుతోంది. ఇలా వెంటవెంటనే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు.. రోగక్రిములకు అనుకూలంగా మారుతున్నాయి. వీటి కారణంగా జలుబు, గొంతునొప్పి, సైనస్‌, నిమోనియా, ఆస్థమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ) తదితర శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న బిడ్డల్ని తీసుకొని తల్లిదండ్రులు ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పిల్లల ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా నిమోనియాతో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఇంచుమించుగా ఒకేలాగా ఉండటం, పైగా స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదవుతుండటంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా స్వైన్‌ఫ్లూ ప్రభావం 48 గంటల్లోనే తీవ్రమవుతుంది. కాలానుగుణ జ్వరాల్లో 98% సాధారణమైనవే ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఏ రకమైన జ్వరమన్నది వైద్యులే గుర్తించాల్సి ఉంటుంది. అనుమానిత లక్షణాల ఆధారంగా ముక్కు, గొంతు నుంచి స్రావాలను తీసి పరీక్షలకు పంపుతున్నారు. స్వైన్‌ఫ్లూ అని సందేహమొస్తే నిర్ధారణ కాకపోయినా చికిత్స మొదలెట్టాల్సి వస్తోంది.

స్వీయ జాగ్రత్తలివీ
* జనసమ్మర్థాల్లో తుమ్మినప్పుడు.. వైరస్‌ త్వరగా పక్కవారికి చేరుతుంది.
* జలుబుతో ఉన్నవారు ఇంట్లో ఒక గదిలో విశ్రాంతి తీసుకోవడం మేలు. వారి చేతి రుమాలును ఇతరులు వాడకూడదు.
* జలుబు, దగ్గుతో బాధపడే పిల్లల్ని బడులకు పంపొద్దు.
* గొంతునొప్పికి వైద్యులు సూచించిన మేరకు పూర్తిస్థాయిలో ఔషధాలను వాడాలి.
* గొంతులో స్రావాలు అడ్డం పడుతున్నప్పుడు.. వేడి నీటితో ఆవిరి పట్టాలి.
* బయటికెళ్లినప్పుడు కాలుష్యం బారినపడకుండా ముక్కు, నోటికి అడ్డంగా అచ్ఛాదన ధరించాలి. తిరిగొచ్చాక చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
* చెవి, ముక్కు, నోటి నుంచి గాలి లోనికి వెళ్లకుండా మఫ్లర్‌ వంటివి వాడాలి.
* ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
* వేడివేడి ఆహార పదార్థాలనే తినాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో పడకలు చాలక… ఒక్కో మంచంపై ఇద్దరు పడుకోవాల్సి వస్తోంది. చిన్న పిల్లల పడకలనూ పెద్దలకు కేటాయిస్తున్నారు. జ్వరాలు, వాంతులతో చికిత్సకు వస్తున్నవారి సంఖ్య పెరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. రోగులను పక్కపక్కనే ఉంచుతుండటంతో సీజనల్‌ వ్యాధులు మరింతగా విజృంభించే ప్రమాదముంది. పడకల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో సిబ్బంది సేవలు అందించలేకపోతున్నారు. – ఈనాడు, సూర్యాపేట

పిల్లల విషయంలో అప్రమత్తత:
పెద్దవారి కంటే పిల్లలకు త్వరగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. బడిలో ఓ చిన్నారికి జలుబువస్తే, మిగతా పిల్లలకూ వచ్చేస్తుంది. ఇంట్లో అందరికీ జలుబు, దగ్గు, జ్వర లక్షణాలుంటే… అది శ్వాస సంబంధ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అని అనుమానించాలి. సాధారణ ఫ్లూ అయితే, ఎక్కువగా నీళ్లను తాగించడం, జ్వరమొస్తే వైద్యుని సూచనల మేరకు మోతాదు ప్రకారంగా పారాసెటమాల్‌ ఇస్తే సరిపోతుంది. మూణ్నాలుగు రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే, మరోసారి వైద్యుడిని సంప్రదించాల్సిందే. సరైన సమయంలో చికిత్స అందకపోతే నిమోనియా ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.