రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ

దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవులన్నింటిలో నేడు సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే ఉన్నారని, ఇది మన ప్రజాస్వామ్య గొప్పతనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహాపురుషులు ఇచ్చిన రాజ్యాంగ శక్తివల్లే సామాన్యుడికి అసమాన్య అవకాశాలు దక్కాయన్నారు. ఈ ఖ్యాతి 125 కోట్ల భారతీయులకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన వెంకయ్యనాయుడును స్వాగతిస్తూ మాట్లాడారు.

‘‘ఆగస్టు 11వ తేదీ దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టంతో ముడిపడి ఉంది. ఇదే రోజు బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన 18 ఏళ్ల యువ విప్లవకారుడు ఖుదీరాంబోస్‌ను ఉరితీశారు. దేశ స్వాతంత్రం కోసం జరిగిన సంఘర్షణ, బలిదానాల గురించి తెలుసుకోవడం మన విధి. వాటి ద్వారా మన బాధ్యత మరింత పెరుగుతుంది. అందుకే నేను ఆ ఘటనను స్మరించాల్సి వచ్చింది. మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. స్వతంత్ర భారత దేశంలో జన్మించి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా వెంకయ్యనాయుడు చరిత్రకెక్కారు. సుదీర్ఘ కాలం క్రియాశీల రాజకీయాల్లో ఉండటంతో పాటు ఇన్నాళ్లు మన లో ఒకరిగా తిరిగి ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తీ వెంకయ్యనాయుడే. ఇక్కడే ఆయన ఇంతింతై అన్నట్లు ఎదిగారు. ఎగువసభలోని ప్రతి అంశం గురించి తెలిసిన వ్యక్తి. సభాసభ్యుడిగా, స్థాయీసంఘాల ఛైర్మన్‌గా, మంత్రిగా అన్నింటిలో స్వయంగా భాగస్వామ్యం వహించిన తొలి ఉపరాష్ట్రపతి ఇప్పుడు దేశానికి లభించారు. ప్రజాజీనంలో ఆయన జేపీ ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చారు. నిజాయితీ, సుపరిపాలన కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థినేత స్థాయి నుంచి ఈ స్థాయి వరకూ స్వయంగా ఎదుగుతూ వచ్చారు.

అసెంబ్లీ, రాజ్యసభ ఏదైనా ఆయన తన వ్యక్తిత్వాన్ని చాటారు. తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. వెంకయ్యనాయుడు రైతుబిడ్డ. ఏళ్ల తరబడి ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించింది. ప్రతి అంశంపైనా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఎంతో విలువైన సమాచారం ఇస్తూ ఉంటారు. కేబినెట్‌లో పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నా మంత్రివర్గంలో చర్చ జరిగినప్పుడు తన శాఖ గురించి ఎంత మాట్లాడేవారో, అంతకుమించి గ్రామీణ, రైతుల అంశాలపై మాట్లాడేవారు. అవి ఆయన హృదయానికి దగ్గరగా ఉన్న అంశాలు. ఆయన కుటుంబ నేపథ్యమే అందుకు కారణం. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిపై కూర్చునప్పుడు ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకున్నాం. రాజకీయాలకు అతీతంగా దాని గురించి మాట్లాడాలి. భారత ప్రజాస్వామ్యం ఎంతో పరిణితి చెందింది. మహాపురుషులు ఇచ్చిన రాజ్యాంగానికి ఎంతో శక్తి ఉంది. దానివల్లే నేడు భారత రాజ్యాంగ పదవులపై పేదలు, సాధారణ కుటుంబాలు, గ్రామసీమల నుంచి వచ్చిన వారు ఆశీనులుకాగలిగారు.

దేశంలో తొలిసారి అన్ని రాజ్యాంగపదవుల్లో ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారు ఉండటం మన రాజ్యాంగం గొప్పతనం. మన పూర్వీకులు మనకు ఇచ్చిన విశిష్టవైభవం. అందుకే మరోసారి రాజ్యాంగ నిర్మాతలందరికీ నమస్కరిస్తున్నా. వెంకయ్యనాయుడికి వ్యక్తిత్వం, కర్తుత్వం, వక్తృత్వం ఉంది. వీటన్నింటిలో ఆయన ఘానాపాటి. ఆయన అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడేటప్పుడు సూపర్‌ఫాస్ట్‌గా వెళ్తుంటారు. ఆలోచనల్లో స్పష్టత ఉన్నప్పుడే అది సాధ్యం. ప్రేక్షకులతో అనుసంధానం కావడం అంటే శబ్దాలతో ఆట కాదు. శబ్దాలతో ఆడుకోవడం వల్ల ఎవ్వరి మనస్సును గెలుచుకోలేం. కానీ శ్రద్ధాపూర్వకమైన మనసు, స్పష్టమైన విచారణధార, నిబద్ధత, దార్శనికతను ప్రదర్శించినప్పుడే మాటలతో మనసు గెలుచుకోవడం సాధ్యం అవుతుంది. వెంకయ్య అది జీవితంలో చూశారు…. సాధించారు. దేశంలోని గ్రామాలకు రహదారి అనుసంధానం కల్పించిన ఘనత వెంకయ్యనాయుడికే దక్కుతుంది. తను అధిష్ఠించిన పదవి గౌరవాన్ని మరింత పెంచేలా ఆయన శక్తిమేర కృషిచేస్తారని, విపక్ష సభ్యుల మనసులను కూడా గెలుచుకునేలా వ్యవహరించగలరని విశ్వసిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ముగించారు.
సంపన్నుల త్యాగాలనూ మరవొద్దు

రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌
ఈనాడు, దిల్లీ: దేశంలో అత్యంత సామాన్యులు సైతం అత్యున్నత స్థానానికి ఎదిగేందుకు అనువైన వాతావరణం కల్పించడానికి మహాత్మా గాంధీ, నెహ్రూలు చేసిన త్యాగాలను మరిచిపోవద్దని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి, సామాన్యుడికి శక్తిమంతమైన రాజ్యాంగం అందించడంలో ఆనాడు సంపన్నులు, జమిందార్లు కూడా తమ సంపదలను, కుటుంబాలను త్యాగం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. వెంకయ్యనాయుడు రాజ్యసభ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడారు.

‘‘కొత్త ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం తర్వాత మా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు. మీరిక్కడ కొత్తకాదు. ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. అప్పుడు మీతో ప్రేమతో గొడవపడ్డాం. నిష్టతో పనిచేసే వారు ఉన్నతస్థాయికి ఎదుగుతారని చెప్పడానికి మీరు ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు చాలా మంది పెద్దపెద్ద పదవుల్లో ఉన్నారు. వారంతా జమిందార్లు, పెట్టుబడిదారులు కాకున్నా సొంత కష్టంతో ఈస్థాయికి వచ్చారు. దాని వెనుక మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నాయి. దీన్ని సంభవం చేసిన కోట్ల మంది పేదలు, కార్మికులకు సెల్యూట్‌ చేస్తున్నా. అందుకు దోహదం చేసిన కోటీశ్వరులు, పెట్టుబడిదారులు, జమిందార్లకూ సెల్యూట్‌ చేస్తున్నా. మోతీలాల్‌నెహ్రూ పెద్ద వకీల్‌. ఆయన సంపాదనను ఈ రోజులతో లెక్కిస్తే రోజుకు రూ.7, 8 కోట్ల వరకు ఆదాయం ఉండేది. మహాత్మా గాంధీ కూడా పెద్ద లాయర్‌ కాబట్టే దక్షిణాఫ్రికా వరకు వెళ్లారు. ఆయన, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌, సర్దార్‌పటేల్‌, మౌలానాఆజాద్‌, తిలక్‌ లాంటి వారంతా సంపన్నులైనా దేశం కోసం అన్నింటినీ త్యాగం చేశారు. గొప్ప రాజ్యాంగం ఇచ్చారు. అలాంటి వారిని మనం మరిచిపోవద్దు. మనిషికి మతం కేవలం మనసులో ఉండాలి. న్యాయం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు నిష్పాక్షికంగా ఉండాలి. అలాంటి పదవిలో కూర్చొనే అవకాశాన్ని అల్లా మీకు కల్పించారు. ప్రతి పార్టీకి సభలో అవకాశం ఇవ్వాలి. గందరగోళంలో ఏ బిల్లూ ఆమోదంపొందకూడదు. ఆ పరంపరను ఇకపైనా కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని ఆజాద్‌ అన్నారు.

గురజాడ మాటలే గుర్తుకు రావాలి
మీకు స్వాగతం పలుకుతూ నేను చివరి ప్రసంగం చేస్తున్నా. మీరు 40 ఏళ్ల నుంచి తెలుసు. విద్యార్థి జీవితం నుంచి ఇప్పటివరకూ ఎదురుపడినప్పుడు భావజాలపరంగా మా మధ్య వాదవివాదాలు నడుస్తూ ఉంటాయి. వైరుద్ధ్య భావాలున్న మీరు ఒకే దగ్గర ఎలా ఉండగలుగుతున్నారని ఓసారి విలేకర్లు అడిగారు. అందుకు వెంకయ్యనాయుడు బదులిస్తూ రైలులో ఎక్కిన తర్వాత బోగీలో సీతారాం కనిపిస్తే నేను దిగిపోవాలా అని చాలా సమయస్ఫూర్తితో చమత్కరించారు. మీరు రెండు అత్యున్నత చిహ్నల కింద కూర్చున్నారు. అందులో ఒకటి సత్యమేవ జయతే అని రాసిన అశోక్‌చక్ర అయితే, రెండోది త్రాసు. అది విక్రమాదిత్యుని స్థానం. కాబట్టి ఈ సభలో లేవనెత్తిన అంశాలను బట్టి మీరు న్యాయం చేయాలి. ఆ పని మీరు చేస్తారని నమ్ముతున్నా. మన భావజాలాలు ఏవైనా దేశం అంటే మట్టికాదోయ్‌… దేశం అంటే మనుషులోయ్‌ అని గురజాడ అప్పారావుగారు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని పనిచేస్తారని నమ్ముతున్నా. మీరు తీర్పు చెప్పేటప్పుడు దేశమంటే మట్టికాదు… ప్రజలు అన్న సిద్ధాంతం చాలా ముఖ్యం. పార్లమెంటు సరిగా పనిచేయలేకపోతే ప్రజల సార్వభౌమాధికారం దెబ్బతింటుంది.
– వెంకయ్యనాయుడిని ఉద్దేశించి సీపీఎం నేత సీతారాం ఏచూరి