నెహ్రా వీడ్కోలు అందుకే…!

టీమ్‌ఇండియా పేసర్‌ ఆశిష్‌ నెహ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారైంది. న్యూజిలాండ్‌తో నవంబరు 1న సొంతగడ్డ దిల్లీలో జరిగే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని ఆశిష్‌ నెహ్రా నిర్ణయం తీసుకున్నాడు! ఈ విషయంపై కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో చర్చించిన అతడు బుధవారం టీమ్‌ఇండియా సభ్యులకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత టీమ్‌ఇండియాలో పునరాగమనం చేసిన 38 ఏళ్ల నెహ్రా అనూహ్యంగా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఐతే వచ్చే ఏడాది షెడ్యూల్‌ ప్రకారం టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశం లేకపోవడమే నెహ్రా రిటైర్మెంట్‌కు కారణమని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరముందని నెహ్రా.. టీమ్‌మేనేజ్‌మెంట్‌కు చెప్పాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లోనూ నెహ్రా ఆడకపోవచ్చు. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా.. భారత్‌ తరఫున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2011లో ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కూడా అతడు సభ్యుడు.