నగరంలో సంచలనం సృష్టించిన మియాపూర్‌ మదీనాగూడకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని చాందిని హత్యకేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఆమె స్నేహితుడు సాయికిరణ్‌ ఈ హత్య చేసినట్లు నిర్ధరించారు. తనను పెళ్లి చేసుకోమని చాందిని ఒత్తిడి చేస్తుండడంతో పథకం ప్రకారమే ఆమెను అమీన్‌పూర్‌ గుట్టలోకి తీసుకెళ్లి హత్య చేశాడని తేల్చారు. ఘటన సమయంలో ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. మదీనాగూడలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మియాపూర్‌ మదీనాగూడలోని సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌కు చెందిన హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపారి కిషోర్‌జైన్‌ కుమార్తె చాందిని జైన్‌(17). ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన చాందిని ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు మియాపూర్‌ పోలీసుస్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత అమీన్‌పూర్‌ గుట్టల్లో ఆమె శవమై కనిపించింది.

ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన రోజు ఆ బాలిక ఓ యువకుడితో ఆటోలో కలిసి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. బాలిక చరవాణి ఆధారంగా పలువురు అనుమానితుల్ని విచారించారు. చివరికి ప్రియుడు సాయికిరణ్‌ ఆమెను అమీన్‌పూర్‌ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.