మెస్సి.. మెస్సి.. మెస్సి!
అర్జెంటీనాను ప్రపంచకప్‌కు తీసుకెళ్లిన స్టార్‌
మూడు గోల్స్‌తో జట్టును గెలిపించిన కెప్టెన్‌
మెగా టోర్నీకి దూరమైన నెదర్లాండ్స్‌, అమెరికా

లయొనెల్‌ మెస్సి అభిమానులు వూపిరి పీల్చుకోవచ్చు! అతణ్ని వచ్చే ఏడాది ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో చూడబోతున్నాం. మెస్సి జట్టు రష్యాలో జరిగే సాకర్‌ సంబరంలో ఆడబోతోంది. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్లలో ఒకడైన మెస్సి మరోసారి తన గొప్పదనాన్ని చాటాడు. అర్జెంటీనా 2018 ఫిఫా ప్రపంచకప్‌ ఆడే అవకాశాలు ప్రమాదంలో పడ్డ స్థితిలో అతను అద్భుత ప్రదర్శనతో జట్టును నిలబెట్టాడు. ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు గోల్స్‌ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు మెస్సి. దీంతో దక్షిణ అమెరికా నుంచి అమెరికాకు ప్రపంచకప్‌ బెర్తు ఖరారైంది. మరోవైపు నెదర్లాండ్స్‌, అమెరికా లాంటి పెద్ద జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడం షాకే.

క్విటో
ఇప్పుడు అర్జెంటీనా అంతటా ప్రపంచకప్‌ గెలిచినంత సంబరం. ఆ దేశమంతా ప్రస్తుతం లయొనెల్‌ మెస్సి పేరు మార్మోగిపోతోంది. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఈసారి టోర్నీకే అర్హత సాధించలేని ప్రమాదంలో ఉండగా.. మెస్సి ఒంటి చేత్తో తమ జట్టును గెలిపించి ప్రపంచకప్‌కు తీసుకెళ్లాడు. నాలుగు ప్రపంచకప్‌ బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొన్న దక్షిణ అమెరికా గ్రూప్‌లో మొన్నటిదాకా అర్జెంటీనా స్థానం ఆరు. గత మ్యాచ్‌లో పెరు లాంటి చిన్న జట్టుపై నెగ్గలేక, డ్రాతో సరిపెట్టుకుని ప్రపంచకప్‌ అర్హత అవకాశాల్ని ప్రమాదంలో పడేసుకున్న అర్జెంటీనా.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఈక్వెడార్‌ను ఓడిస్తేనే బెర్తు సాధించే స్థితిలో నిలిచింది. ఐతే తీవ్ర ఒత్తిడి నెలకొన్న ఈ మ్యాచ్‌లో మెస్సి తన ప్రపంచ స్థాయి ఆటతో అబ్బురపరిచాడు. ఒక్కడే మూడు గోల్స్‌ కొట్టి.. జట్టుకు 3-1తో విజయాన్నందించాడు. మ్యాచ్‌ తొలి నిమిషంలోనే రొమారియా ఇబర్రా గోల్‌ కొట్టడంతో అర్జెంటీనా జట్టు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా అందరిలో గుబులు పట్టుకుంది. ఐతే కాసేపటికే మెస్సి మాయ మొదలైంది.

11వ నిమిషంలో మైదానం మధ్యలో బంతిని తన అధీనంలోకి తెచ్చుకున్న మెస్సి.. అక్కడి నుంచి బంతిని డి మారియాకు అందించాడు. మారియా బంతిని మళ్లీ పాస్‌ అందించేలోపు గోల్‌ పోస్టు దగ్గరగా వచ్చేశాడు మెస్సి. మెరుపు వేగంతో అతను కొట్టిన షాట్‌కు ఈక్వెడార్‌ గోల్‌కీపర్‌ దగ్గర సమాధానమే లేకపోయింది. ఈ జోరును కొనసాగిస్తూ 20వ నిమిషంలో ఇంకో గోల్‌ కొట్టి అర్జెంటీనాకు ఆధిక్యాన్నందించాడు. ఇక 62వ నిమిషంలో గోల్‌ పోస్టుకు 40 గజాల దూరం నుంచి మెస్సి కొట్టిన గోల్‌ అయితే కళ్లు చెదిరిపోయేదే. మ్యాచ్‌లో ఆ తర్వాత గోల్స్‌ నమోదు కాలేదు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణ అమెరికా గ్రూప్‌లో ఆరో స్థానంలో ఉన్న అర్జెంటీనా.. ఈ విజయం తర్వాత మూడో స్థానానికి ఎగబాకింది. ప్రపంచకప్‌ బెర్తును కూడా కైవసం చేసుకుంది. బ్రెజిల్‌ ఇప్పటికే అగ్రస్థానంతో ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. 2, 4 స్థానాల్లో నిలిచిన ఉరుగ్వే, కొలంబియా కూడా ముందంజ వేశాయి. ఐదో స్థానంలో నిలిచిన పెరు.. ఓషియానియా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో ప్రపంచకప్‌ బెర్తు కోసం ప్లేఆఫ్‌ ఆడుతుంది. మరోవైపు ఐరోపా గ్రూప్‌ నుంచి తాజాగా పోర్చుగల్‌, ఫ్రాన్స్‌ కూడా ప్రపంచకప్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. అగ్రశ్రేణి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహించే పోర్చుగల్‌ అవకాశాలు కూడా ప్రమాదంలో ఉండగా.. స్విట్జర్లాండ్‌పై 2-0తో నెగ్గిన ఆ జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌ 2-1తో బెలారస్‌పై నెగ్గి ప్రపంచకప్‌ బెర్తు సాధించింది.

నెదర్లాండ్స్‌కు షాక్‌: అర్జెంటీనా, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌ జట్లు చివరి దశలో విజయాలతో ప్రపంచకప్‌కు అర్హత సాధించి వూపిరి పీల్చుకుంటే రెండు పెద్ద జట్లకు షాక్‌ తగిలింది. 2010 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్‌ వచ్చే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. మరో ప్రముఖ జట్టు అమెరికా సైతం ప్రపంచకప్‌కు దూరమైంది. స్వీడన్‌తో చివరి మ్యాచ్‌లో 7-0తో గెలిస్తేనే ప్రపంచకప్‌కు అర్హత సాధించే స్థితిలో నెదర్లాండ్స్‌ 2-0తో మాత్రమే నెగ్గగలిగింది. నెదర్లాండ్స్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టె¯ అర్జెన్‌ రాబెన్‌ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. మరోవైపు అమెరికా చావోరేవో మ్యాచ్‌లో 1-2తో ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో చేతిలో ఓడి ప్రపంచకప్‌ అవకాశాలు చేజార్చుకుంది.