సాధారణ తుపానుగా మారిన హరికేన్‌ ఇర్మా
అయినా భారీ వర్షాలతో వరదలు వచ్చే ప్రమాదం
తంపా/వాషింగ్టన్‌

ఫ్లోరిడాపై చండప్రచండంగా విరుచుకుపడి ఆ తర్వాత కాస్త నెమ్మదించిన హరికేన్‌ ఇర్మాతో ఇంకా పెను ముప్పు పొంచే ఉంది. సాధారణ తుపాను స్థాయికి తీవ్రత తగ్గినప్పటికీ దీని ప్రభావం వల్ల బలమైన గాలులు వీస్తూనే ఉన్నాయి. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలు, సముద్రంలో ఎగసిపడుతున్న అలలు వల్ల తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు హెచ్చరించారు. ఇర్మా ప్రస్తుతం జార్జియా, అలబామా, మిస్సిసీపీ, టెన్నెసీల వైపు కదులుతోంది. త్వరలోనే ఫ్లోరిడాను సందర్శించనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇర్మా ధాటికి విలవిలలాడిన ఫ్లోరిడాలో సహాయక చర్యలకూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల నివాస గృహాలు, వ్యాపార దుకాణాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి గాఢాంధకారం నెలకొంది. ఓర్లాండో నగర శివారుల్లోకి వరద నీరు ప్రవేశించింది. 120 ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. మియామి, ఫోర్ట్‌లారా తదితర ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసమయ్యాయి. సముద్రం ఉప్పొంగే ప్రమాదం ఉందని భయపడుతున్నట్లు తంపా మేయర్‌ బక్‌హార్న్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

భారత అమెరికన్ల చేయూత
అట్లాంటా, జార్జియాలలోని భారత అమెరికన్ల సంస్థలు హరికేన్‌ ఇర్మా బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగారు. ఫ్లోరిడాలో 1.20 లక్షల మంది వరకూ భారత అమెరికన్లు నివసిస్తున్నట్లు సమాచారం. మియామి, ఫోర్ట్‌లారా తదితర చోట్ల కూడా వేలల్లోనే నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది సహాయక శిబిరాలకు వెళ్లకుండా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సర్నా సూచన మేరకు న్యూయార్క్‌లో ఉంటున్న కాన్సుల్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తీ అట్లాంటాకు వెళ్లారు. తంపా తదితర ప్రాంతాల్లో భారత అమెరికన్లకు అందుతున్న సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సేవా ఇంటర్నేషనల్‌, అమెరికా తెలుగు అసోసియేషన్‌, హిందూ టెంపుల్‌ ఆఫ్‌ అట్లాంటా, ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అట్లాంటా తదితర సంస్థలు హరికేన్‌ బాధితులకు ఆహారం, వసతిని సమకూరుస్తున్నాయి. రెండు వారాల క్రితం హార్వీ హరికేన్‌ ధాటికి ధ్వంసమైన టెక్సాస్‌లో జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. బాధితులు తమ నివాసాలను పునరుద్ధరించుకుంటున్నారు. సేవా ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో భారత అమెరికన్లు 800 మంది మందుకు వచ్చి శిథిలాల తొలగింపు, నిర్మాణ, గదుల పరిశుభ్రం తదితర పనుల్లో సాయపడుతున్నారు. భారతీయ రెస్టారెంట్ల నుంచి బాధితులకు ఆహార పదార్థాలను చేరవేస్తున్నారు. హార్వీ తీరాన్ని తాకినప్పటి నుంచి హ్యూస్టన్‌లోని రెస్టారెంట్ల నుంచి 30వేల భోజనాలు అందించినట్లు కఫే ఇండియా యజమాని దినేష్‌ పురోహిత్‌ వెల్లడించారు.

క్యూబాలో 10 మంది మృతి
హవానా: హరికేన్‌ ఇర్మా వల్ల వీచిన ప్రచండ గాలులు, భారీ వర్షాలకు క్యూబాలో 10మంది మృత్యువాతపడ్డారు. రాజధాని హవానాతో పాటు పలు దీవుల్లో అపార ఆస్తినష్టం జరిగింది. కొందరు తమ నివాసాల్లోనే ఉండిపోయారని, విద్యుదాఘాతం, నీటిలో మునిగిపోవటం, భవనాలు కూలటం తో ప్రాణనష్టంజరిగిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

హమ్మయ్యా.. అంత భయపెట్టలేదు!
ఈనాడు, అమరావతి: ‘ఇర్మా’ పెనుతుపాను తీరం దాటడంతో దాని ప్రభావమున్న ఫ్లోరిడాలోని తెలుగు ప్రజలు వూపిరి పీల్చుకున్నారు. తెలుగు ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నట్లు తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడాకు చెందిన రావ్‌ బండారుపల్లి ‘ఈనాడు’కు తెలిపారు. తామున్న ఫోర్ట్‌లాండర్‌డేలో ఇర్మా ప్రభావం పెద్దగా లేదని డాక్టర్‌ వేణు దేవభక్తుని చెప్పారు. విద్యుత్‌ను సోమవారం రాత్రి పునరుద్ధరించారన్నారు.