మాజీ భార్య నుంచి తన కుమారుడిని రప్పించుకోవడానికి కిడ్నాప్‌ నాటకం ఆడాడు ఓ భోజ్‌పురి నటుడు. మహ్మద్‌ షాహిద్‌ భోజ్‌పురి చిత్రాల్లో నటిస్తున్నాడు. షాహిద్‌ కొంతకాలం క్రితం భార్య ముంతాజ్‌ నుంచి విడిపోయి మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు.

ఇతనికి ఓ కుమారుడు ఉన్నాడు. విడాకులు తీసుకునే సమయంలో న్యాయస్థానం ఆ బాలుడి బాధ్యతలను తల్లికి అప్పగించింది. దాంతో ఎలాగైనా తన కుమారుడిని ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో షాహిద్‌ జూన్‌లో అతడిని కిడ్నాప్‌ చేశాడు.

దాంతో ముంతాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ముందు షాహిద్‌పైనే అనుమానం వచ్చింది. ఇంతలో అతను కుమారుడిని తీసుకుని పారిపోయాడు. అతను దిల్లీలో తలదాచుకున్నాడని తెలిసి పోలీసులు ముమ్మరంగా గాలింపులు చేపట్టారు. మంగళవారం షాహిద్‌ను అరెస్ట్‌ చేసి బాలుడిని తల్లికి అప్పగించారు.
కుమారుడి కోసం తానే కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు షాహిద్‌ విచారణలోతెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్‌ చేశారు.