హైదరా‘బాధ’.. ఆక్రమణల గాథ!
500 ఎకరాల విస్తీర్ణంలో చెరువు కబ్జా
నగరంలో వందల కాలనీల్లో ముంపు
ఉప్పొంగిన చెరువులు

హైదరాబాద్‌ నగరంలో చెరువులను ఆక్రమించిన పాపం ఇప్పుడు లక్షల మంది అనుభవిస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం రాజధాని పరిధిలోని చెరువుల్లో దాదాపు 500 ఎకరాలమేర ఆక్రమించి కొంతమంది అమ్మివేశారు. ఈ ఆక్రమణలతో నగరంలోని వందలాది కాలనీలు ముంపులో చిక్కుకుంటున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం దాదాపు వంద కాలనీలపై పడింది.
ఒక్కో చెరువుది ఒక్కో కథ!

రెవెన్యూ రికార్డుల ప్రకారం సరూర్‌నగర్‌ చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు. లోతుగా.. ఎక్కువ విస్తీర్ణంలో ఇది ఉండటంతో పదేళ్ల కిందట చెరువు కింద ఎంత భారీ వర్షం పడినా కాలనీల మీదకు నీరు వచ్చేది కాదు. గత పదేళ్ల నుంచి ఆక్రమణలు మొదలయ్యాయి. రాత్రిపూట నీటిలో మట్టి పోసి మెల్లమెల్లగా చెరువు గర్భాన్ని మెరక చేయడం మొదలుపెట్టారు. కిందిస్థాయి అధికారుల తోడ్పాటుతో ఈ కబ్జా వ్యవహారం సాగింది. ఇప్పుడు చెరువు 50 ఎకరాలకు పరిమితమైంది. ఉన్న చెరువు కూడా పూర్తిగా కుంచించుకుపోయింది. దీని పరిసరాల్లో ఆరేడు సెంటీమీటర్ల వర్షం పడితే చాలు చెరువు పొంగుతోంది. ఈ చెరువు నుంచి నీళ్లను తీసుకువెళ్లే నాలాలు కూడా ఆక్రమణ చెరలో ఉన్నాయి.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ చెరువులోకి పెద్దఎత్తున నీరు చేరి అనేక కాలనీలను ముంచెత్తింది. గడ్డిఅన్నారం డివిజన్‌లోని శారదానగర్‌, కోదండరాంనగర్‌తో పాటు అనేక కాలనీలు ముంపులో ఉండిపోయాయి. రోజురోజుకు ముంపు పెరుగుతుండటంతో కొన్ని ఇళ్ల వారు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ కొంత ముంపు తొలగిపోయినా ఇప్పటికీ అస్తవ్యస్త పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తుండటంతో రాత్రి పన్నెండు గంటల వరకు నిద్ర పోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణల తొలగింపే సమస్యకు పరిష్కారమంటున్నారు.

* రామంతాపూర్‌ పెద్ద చెరువు పరిస్థితి కూడా ఇలానే ఉంది. 32 ఎకరాల చెరువులో దాదాపు 12 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో ఉంది. ఇటీవల వర్షాలకు సమీపంలోని రవీంద్రకాలనీ, లక్ష్మీనగర్‌ తదితర మరికొన్ని కాలనీలు నీట మునిగాయి. పదిరోజులు నుంచి మోకాలి లోతు నీటిలో అక్కడి జనం ఉన్నారు. కొంతమంది రోగాలతో ఆస్పత్రిపాలయ్యారని స్థానికులు తెలిపారు.
* నాచారంలోని ఎర్రకుంట చెరువు పరిస్థితి కూడా వీటికి భిన్నంగా ఏమీ లేదు. 20 ఎకరాల చెరువు 10 ఎకరాలైంది. మల్కాజిగిరి ప్రాంతం నుంచి పెద్దఎత్తున వచ్చే వర్షం నీరు ఈ చెరువుపై పడుతోంది. నాలాలు కూడా ఆక్రమణదారుల చెరలోనే ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇందిరానగర్‌, రాఘవేంద్రనగర్‌, భవానీనగర్‌ తదితర కాలనీలు మోకాలి లోతు నీటిలో చిక్కుకున్నాయి. ఈ కాలనీల్లో ఉండే దాదాపు పదివేల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఆక్రమణల తొలగింపుపై చర్యలేవి
నగరంలోని 183 చెరువుల్లో అధిక భాగం ఆక్రమణల్లో ఉన్నాయని ఆధారాలు సైతం అధికారుల వద్ద ఉన్నాయి. ఇటీవల చెరువు ఎఫ్‌టీఎల్‌ గుర్తించినపుడు ఆక్రమణలు వెలుగులోనికి వచ్చాయి. అనేక ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఆక్రమణలను తొలగించే ప్రక్రియను మాత్రం బల్దియా అధికారులు చేపట్టడం లేదు. అక్రమణల్లో నిర్మాణాలను తొలగించినా కూడా కొంత వరకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.