కలలు అందరూ కంటారు… వాటిని సాకారం చేసుకునేది ఏ కొద్దిమందో మాత్రమే. ఆ కొద్దిమందిలో తానూ ఒక్కతైంది ఇరవైమూడేళ్ల డాక్టర్‌ తేజస్విని మనోజ్ఞ. చదువూ, భరతనాట్యం.. యోగా.. సేవా.. అందాలపోటీలు..ప్రధానమంత్రి పతకం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆమె సొంతం. అందాలపోటీలకు సిద్ధమవుతూ.. పీజీ, సివిల్స్‌పై దృష్టి పెట్టిన ఆమె.. అసలు అనుకున్నవన్నీ ఎలా సాధించిందో ఆమె మాటల్లోనే..

చదువుకుంటున్నప్పుడే నాకు అందాలపోటీలపై ఆసక్తి కలిగింది. దాన్లో పాల్గొని గెలుపొందితే గనుక.. సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనిపించింది. అందుకే ఆ మధ్య జరిగిన యమహా ఫాసినో మిస్‌ దివా-2017 ఆడిషన్స్‌కు వెళ్లా. అందులో తొలి విడతగా సదరన్‌ మిస్‌ దివా పోటీల్లో పాల్గొన్నా. గెలుపొందా. ఇప్పుడు మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్నా. ఆ తరవాత మిస్‌ యూనివర్స్‌.. అందులో గెలుపొందితే గనుక ఐకరాజ్యసమితి (యూఎన్‌)లో ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు, పిల్లలకు చేయొచ్చనేది నా ఆలోచన. ఈ పోటీలకు వెళ్లడానికి కారణం.. ఒక విధంగా నాకు సేవపై ఆసక్తి ఉండటమే. మా సొంతూరు మహబూబ్‌నగర్‌ పట్టణం. కానీ నేను పుట్టిపెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న మదన్‌మోహన్‌ శర్మ బ్యాంకు ఉద్యోగి, అమ్మ అనిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేసేది. ఆరేళ్లకే భరతనాట్యం నేర్పించారు. అమ్మ స్వతహాగా పాటలు పాడుతుంది. దాంతో సంగీతమూ నేర్చుకున్నా. స్కూల్‌లో ఉండగానే నాట్య ప్రదర్శనలు ఇచ్చా. వీటిల్లో ఎక్కువగా సేవా కార్యక్రమాల కోసం చేసినవే. అంటే ఫండ్‌రైజింగ్‌ కోసమే ప్రదర్శనలు ఇచ్చా. అలా ఇప్పటి వరకు 2500 వరకూ ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చాను. అమెరికాలోనూ రెండుసార్లు ఓ సేవా కార్యక్రమం కోసం ప్రదర్శన ఇచ్చా.

ప్రధానమంత్రి పతకం.. కార్యక్రమం ఏదయినా చదువుకుంటూనే చేసేదాన్ని. అక్కడ 8, 9వ తరగతుల్లో ఎన్‌సీసీలో చేరి శిక్షణ పొందాను. ఎక్కడ క్యాంపులున్నా ఇష్టంగా పాల్గొనేదాన్ని. పదో తరగతిలో 93 శాతం మార్కులు వచ్చాయి. ఇంటర్‌ చదువుతూ కూడా ఎన్‌సీసీ ఏబీసీ సర్టిఫికెట్లు (విభాగాలు) పూర్తిచేసేందుకు శిక్షణ తీసుకున్నా. దిల్లీలో శిక్షణ తీసుకుంటూ 13 లక్షల మంది ఎన్‌సీసీ విద్యార్థుల్లో అనేక స్థాయుల్లో డ్రిల్‌, కవాతు, బృంద చర్చ, రైఫిల్‌ షూటింగ్‌, త్రివిధ దళాల అధికారులతో ఇంటర్యూలు.. ఇలా అన్ని విభాగాల్లో పాల్గొని 2010లో ఎన్‌సీసీలో ‘ఆల్‌ ఇండియా బెస్ట్‌ క్యాడెట్‌’గా నిలిచాను. దానికి ప్రధామంత్రి పతకం వచ్చింది. అలాగే శ్రీలంకలో నిర్వహించిన సార్క్‌ దేశాల యువ ప్రతినిధుల సదస్సులో మన దేశం నుంచి వెళ్లా. రాష్ట్రపతీ, రక్షణశాఖ మంత్రి, ఆర్మీ దళాలతో తేనీటి విందు ఇవన్నీ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని పీజీ, సివిల్స్‌ చేయాలనుకుంటున్నా.

పోలీసులకు యోగా శిక్షణ…. పదో తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో యోగాలో డిప్లొమా చేశాను. అప్పుడు మా గురువుగారు జూనియర్స్‌కు తరగతులను నాతో చెప్పించేవారు. ఖాళీ సమయంలో తరగతులు కావాలని అడిగిన వారికీ చెప్పేదాన్ని. అంతేకాదు.. కొండాపూర్‌లోని 8వ పోలీస్‌ బెటాలియన్‌, యూసుఫ్‌గూడలోని మొదటి పటాలంలో శిక్షణ పొందే పోలీసు సిబ్బందికి ఈ ఏడాది యోగాలో శిక్షణ ఇచ్చాను. ఇది నా వైద్య విద్యకూ ఉపయోపడింది. ఏ సమస్యలు ఉన్నవారు ఏ ఆసనాలు వేయాలి వంటివి శాస్త్రబద్దంగా వివరిస్తూ చెప్పడం వల్ల అందరూ నేర్చుకోవడానికి ఇష్టపడేవారు. బాలరత్న సమైక్య భారత్‌ జాతీయ పురస్కారం రావడం, ప్రధానమంత్రి మెడల్‌ను అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సింగ్‌ చేతుల మీదగా పతకం అందుకోవడం, శ్రీలంక రాష్ట్రపతి రాజపక్సే నుంచి బహుమతి తీసుకోవడం మరచిపోలేను. అంతకన్నా ఎంబీబీఎస్‌ చదివే రోజుల్లో మా కళాశాలకు వచ్చిన మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం నా నాట్యప్రదర్శనను చూసి.. ‘నేటి నృత్యకారిణీ, కాబోయే వైద్యురాలు ఎంతో సున్నిత మనస్తత్వంతో సేవలు అందించగలద’ని సభావేదికపై ప్రశంసించడం గొప్ప అనుభూతి. ప్రస్తుతం సెప్టెంబరులో ముంబయిలో జరిగే మిస్‌ దివా(మిస్‌ యూనివర్స్‌ ఆఫ్‌ ఇండియా) పోటీలకు సిద్ధమవుతున్నా.