ఇంట్లోంచి పారిపోయిన ఇద్దరు బాలురు ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పట్టుబడిన వారి వద్ద పెద్దమొత్తంలో నగదు గుర్తించిన పోలీసులు.. ఆరా తీయడంతోవారు ఇంట్లోంచి పారిపోయి వచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది.

నగరంలోని ఎల్బీనగర్‌లో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు బాలురు స్కూటీ నడుపుతూ పట్టుబడ్డారు. వారి వద్ద రూ.1.22 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. బాలురు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల క్రితమే వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయారని తల్లిదండ్రులు తెలిపారు. పట్టుబడిన ఇద్దరి వయస్సూ 14 ఏళ్లలోపే కాగా.. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ స్కూటీపై చేరుకోవడం గమనార్హం.