ఆమె అతడు… అతడికి ఆమె… వారికిద్దరు. చల్లటి సంసారం, చక్కటి పిల్లలు. ఉన్నతమైన ఉద్యోగం. ఇంకేం కావాలి ఏ మగువకైనా. కానీ అంతలోనే అనుకోని ఓ పెద్ద సునామీ. యుద్ధక్షేత్రంలో మృత్యువు అతడిని కబళించింది. సైనికుడిగా ఉద్యోగ నిర్వహణలో అతడు ప్రాణాలొదిలాడు. ఆ సంఘటనతో ఆమె స్థాణువే అయ్యింది. అంతలోనే తేరుకుని పిల్లలను అక్కున చేర్చుకుంది. భర్తకు ఎంతో ప్రియమైన ఉద్యోగాన్ని ఎన్నో కష్టాలకోర్చి ఇష్టంగా సాధించుకుంది. తన భర్త భౌతికంగా ఆ యూనిఫామ్‌లో బతికే ఉన్నాడని నమ్ముతున్నానంటోంది..

2015, నవంబరు 17వ తేదీ. కశ్మీర్‌ సరిహద్దుల్లో, కుప్వారా ప్రాంతంలో తీవ్రవాదులకూ, సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో కల్నల్‌ సంతోష్‌ మహాదిక్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం కుదేలైపోయింది. భార్య, ఇద్దరు పిల్లలు దిక్కు లేకుండా అయిపోయారు. అయితే.. అక్కడితో ఈ విషయం ఆగిపోలేదు. సంతోష్‌ భార్య స్వాతి దుఃఖంలోంచి తేరుకుంది. తన భర్త అధికంగా ప్రేమించే యూనిఫాంను తాను ధరించాలనుకుంది. 37 ఏళ్ల వయసులో ప్రవేశ పరీక్షలకు హాజరైంది. చెన్నై ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఓటీఏ) లో ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకుంది. ఆమెను పలకరిస్తే..

అంతా చీకటైపోయింది..
‘మేమిద్దరం మాకు ఇద్దరు అన్నట్టు ముచ్చటగా ఉండేది మా కుటుంబం. దేశరక్షణని ఆయన కేవలం ఓ ఉద్యోగంలా చూసేవారుకాదు. అమితంగా ప్రేమించేవారు. నేను డిగ్రీ చదువుకున్నాను. ఉద్యోగం చేసేదాన్ని. నవంబరు 17న ఆ వార్త మా కుటుంబాన్ని నిలువునా కూల్చేసింది. ఆయన మరణం నా ప్రపంచాన్ని చీకటిచేసేసింది. ఆ చీకటిని పారదోలే వెలుగు ఈ పచ్చటి యూనిఫామే ఇస్తుందని నమ్మా. అందుకే ఇలా వచ్చా.

సెప్టెంబరు 29న శిక్షణకు చేరాను. నా శక్తి నేను తెలుసుకున్నాను. మొదట్లో ఈతకొట్టడానికి ఎంత భయపడ్డానో!స్విమ్మింగ్‌ పూల్‌లో 10 మీటర్లు దూరానికి దూకడానికి చాలా భయపడ్డాను. కానీ ఆయన తెగువ గుర్తొచ్చింది. దేశరక్షణ బాధ్యత ముందు ఇవన్నీ చిన్న విషయాలనిపించింది. ఈ యూనిఫారం వేసుకుంటే ఆయన నాకు దగ్గరగా ఉన్నట్టే ఉందిప్పుడు. పెళ్లైనప్పటి నుంచి మరణం దాకా కూడా అయన తన విధుల గురించి, అక్కడున్న ప్రమాదాల గురించి ఏవీ పంచుకునేవారు కాదు. కానీ ఆయన తరచూ చెప్పే విషయం ఒకటుంది. జమ్మూ కశ్మీరు సరిహద్దుల్లో ఉండే చిన్నారుల దైన్యం గురించి తరచూ చెబుతుండవారు. వాళ్లు చదువుకెంత దూరమవుతున్నారోనని బాధపడేవారు. ఇదిగో నాకూ అక్కడికెళ్లే అవకాశమంటూ వస్తే.. ఆ చిన్నారుల్ని నా పిల్లలుగా చూసుకోవాలని అనుకుంటున్నా. వాళ్ల చదువుకోసం వీలున్నంత సాయం చేయాలని అనుకుంటున్నా. నేను ఎంతోమందికి స్ఫూర్తి అని అందరూ అంటున్నారు అలా అయితే అంతకన్నా సంతోషం ఏముంది! జీవితాంతం ఆయనతో కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నాను! దేశరక్షణలో నేను భాగం అవడం ద్వారా ఆయన కలల్ని నేను సొంతం చేసుకున్నాను. ఆ ఆదర్శాన్ని నా జీవితాంతం తీసుకెళతాను. అందుకోసం నా ప్రయాణం ఇదిగో ఇప్పుడే మొదలైంది..!