మద్యం మత్తులో దూసుకెళ్తూ డివైడర్లను ఢీకొడుతున్న ద్విచక్ర వాహన చోదకులు రహదారులపై వెళ్తూ ఉన్నట్టుండి నియంత్రణ కోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొడుతున్న కార్లు పాదచారులను తప్పించే క్రమంలో కంగారుపడి జనంపైకి వెళ్తున్న బస్సు డ్రైవర్లు వాహనాలు ఇంకా దూరంగా వస్తున్నాయ్‌ కదా… అనుకుని రహదారి దాటే క్రమంలో గాయపడుతున్న పాదచారులు

నగరంలో తరచూ చోటుచేసుకునే ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్‌ అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాల రద్దీని, ప్రాంతాలను గుర్తించి… ట్రాఫిక్‌ను అంచనా వేసి, నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌. పంజాగుట్ట, సికింద్రాబాద్‌, కోఠి, ఆబిడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, నారాయణగూడ, కాచిగూడ, అంబర్‌పేట, మలక్‌పేట… నగరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలివి. ఇక్కడ సూచికలను ఉంచడం… బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం… ప్రత్యేక బృందాలను నియమించడం వంటివి చేస్తున్నారు. వాస్తవానికి ఫలానా ప్రాంతంలోనే ఎందుకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయో ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు విశ్లేషించారు. 37 ప్రాంతాల్లో ప్రమాదాలు నమోదవుతున్నాయని నిర్ధారించారు. మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు ప్రమాద భరితంగా మారకుండా చర్యలు చేపట్టాలంటూ జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారు.

లోపాలెక్కడ?… నగరం, శివారు ప్రాంతాల్లోని ప్రధాన, అనుసంధాన రహదారుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అక్కడ ఎందుకు ప్రమాదం జరిగింది? లోపం ట్రాఫిక్‌ పోలీసుదా? రహదారిదా? వాహన చోదకుడిదా? అన్న అంశాలపై సూక్ష్మస్థాయిలో నివేదికను రూపొందించారు. ట్రాఫిక్‌ పోలీస్‌ లేనప్పుడు వాహన చోదకులు రాంగ్‌ రూట్‌లో వెళ్తుంటారు. ఈ కారణంగా ప్రమాదం జరుగుతుంటే అక్కడ ట్రాఫిక్‌ పోలీస్‌ నిరంతరం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. రహదారిపై గుంతలు, వంపు తిరగడం, మలుపు కనిపించకుండా బారికేడ్‌ అడ్డంగా ఉండటం వంటివీ కారణమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు, మెట్రోరైల్‌ అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా చర్యలు చేపట్టి, శాశ్వత పరిష్కార దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లో భవిష్యత్తులో వాహనాలు ఢీకొనకుండా ద్విచక్ర వాహన చోదకులు జారిపడకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు. దీంతోపాటు గతంలో ప్రమాదాలకు చిరునామాలుగా మారిన రహదారులపై ఉన్న గుంతలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులతో పాటు జాతీయ రహదారుల సంస్థ, జీహెచ్‌ఎంసీ మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో అక్కడ ప్రమాదాలు కాస్త తగ్గాయి.

తనిఖీల లోపం… నగరంలోనే కాదు… సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో తొమ్మిదో నంబరు, ఏడో నంబరు జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. చందానగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకూ శంషాబాద్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ ఉన్న జాతీయ రహదారులతో పాటు రాజీవ్‌ రహదారిపై నిత్యం ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఇక్కడ తరచూ అధికారులు తనిఖీలు చేయక పోవడం, వాహనాల వేగం పెరగడంతో ప్రమాదాలు తగ్గడం లేదు.

అనూహ్య పరిణామాలు
వాహన చోదకుల తప్పిదాలు, అనూహ్యంగా చోటుచేసుకునే పరిణామాల కారణంగా నమోదవుతున్న ప్రమాదాల్లో పాదచారులు బాధితులుగా మారుతున్నారు. రహదారి దాటుతున్నప్పుడు, పక్కగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాహనాలు వారిని ఢీకొంటున్నాయి. రాత్రి వేళల్లో వాహనాలకున్న శక్తిమంతమైన దీపాలు కళ్లలోకి పడటంతో అయోమయానికి లోనై అక్కడే నిల్చుని ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరి తర్వాత ప్రమాదాల్లో చనిపోతున్న వారు ద్విచక్ర వాహన చోదకులే.. వేగాన్ని నియంత్రించలేక డివైడర్లను ఢీకొడుతున్నారు. కొందరు శిరస్త్రాణం ధరించక పోవడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందుతున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగిన ప్రమాదాలను విశ్లేషించగా… 80 శాతం మంది ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించక పోవడం వల్లే ప్రమాదాల బారిన పడ్డారని నిర్ధరణ అయింది. జులై నుంచి శిరస్త్రాణం ధరించేవారి సంఖ్య పెరగడం, ఆగస్టు 1 నుంచి పాయింట్ల విధానం అమల్లోకి రావడంతో ప్రమాదాల సంఖ్య తగ్గిందని ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు.