ఫేస్‌బుక్‌లో వీడియోలు చూడాలంటే అంతర్జాల కనెక్షన్‌ లేదంటే వైఫై ఉండాల్సిందే. త్వరలో ఈ రెండూ లేకపోయినా ఫేస్‌బుక్‌లో వీడియోలు చూడొచ్చు. దీని కోసం ఎఫ్‌బీ కొత్త టూల్‌ను సిద్ధం చేస్తోంది. యూట్యూబ్‌లోని ఆఫ్‌లైన్‌ వీడియోల తరహాలోనే ఇదీ పని చేస్తుంది. వైఫై పరిధిలో మీ మొబైల్‌ ఉన్నప్పుడు యాప్‌లో కొన్ని వీడియోలు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ వీడియోలను నెట్‌ కనెక్షన్‌ లేకుండానే వీక్షించొచ్చు.

వీడియోలను ఆఫ్‌లైన్‌ సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ ప్రస్తుతమూ ఉంది. అయితే ఇందులో ఆయా వీడియోలను మీరే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కొత్త ఆప్షన్‌లో మీ ప్రమేయం లేకుండానే వీడియోలు డౌన్‌లోడ్‌ అవుతాయి.ఏవి ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాలనేది మీరు ఎంచుకున్న ప్రాధాన్యాలను (ప్రిఫరెన్స్‌) బట్టే ఉంటుంది. ఇలా డౌన్‌లోడ్‌ అయిన వీడియోలపైన మెరుపు (లైట్నింగ్‌) గుర్తు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ప్రయోగాత్మకంగా కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరూ వినియోగించుకోవచ్చు.