Education

‘సిగ్గేస్తోంది’.. తొంభైవ దశకం చివర్లో వచ్చిన ఓ నవల ఇది. రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌. వాణిజ్య నవలలకి ఆదరణ తగ్గిపోతున్న కాలంలో వచ్చినందువల్లేమో.. దాన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అంతవరకూ ఎవరూ రాయని ఓ అంశాన్ని ఇది ప్రస్తావించింది. అది.. చిన్నారులతో అశ్లీల వీడియోలు తీయడం! ‘ఎంత ఘోరం! ఇలా కూడా జరుగుతుందా?’ అనిపిస్తుంటుంది ఆ నవల చదువుతుంటే! కానీ అంతర్జాలం రాకతో ఈ నేరం గత ఇరవై ఏళ్లలో వందశాతం పెరిగింది! ఆ దుశ్చర్యల్ని అడ్డుకోవడానికి దేశంలోనే తొలిసారి ఓ హాట్‌లైన్‌ ప్రారంభించారు ఉమా సుబ్రమణియన్‌. ‘ఆరంభ్‌’ దాని పేరు. అది ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో ఆమె మాటల్లోనే..

ఇప్పటికిప్పుడు మీరు అంతర్జాలంలోకి వెళ్లి ఆంగ్ల పదం ‘టీన్స్‌’ అని టైప్‌ చేసి చూడండి. మీ బ్రౌజర్‌లో ఎలాంటి ఫిల్టర్‌ లేకపోతే.. అసహ్యమైన, అసభ్యమైన వీడియోలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. ఫిల్టర్‌ ఉన్నా దాని కన్నుగప్పి వచ్చే అశ్లీల చిత్రాలూ ఒకట్రెండైనా ఉంటాయి. పేరుకే టీన్స్‌.. ఆరునెలల పిల్లలపై చేసే అమానుషకృత్యాల నుంచి పదహారేళ్ల వారిచేత చేయించే అసహజ లైంగికదృశ్యాల దాకా ఉంటాయందులో! మెదడు పుచ్చి, మనసు కుళ్లి మనుషుల వేషం కప్పుకున్న మృగాలు రూపొందిస్తాయీ చిత్రాల్ని. అంతేస్థాయి.. మనోవైకృత్యం ఉన్నవాళ్లూ చూస్తుంటారు వీటిని. కొన్ని గణాంకాలు మీకు చెబుతాను. పిల్లల్ని బెదిరించో, హింసించో, మభ్యపెట్టో, మత్తులోకి నెట్టో అసభ్య వీడియో చిత్రాలు రూపొందించి అంతర్జాలంలో పెట్టిన వీడియోలు 2002లో నలభై అయిదువేలుండేవి. కేవలం పదిహేనేళ్లలో వాటి సంఖ్య పదకొండు కోట్లకి చేరింది! చూసేవాళ్ల సంఖ్యా తక్కువ కాదు. ఈ విషయంలో మనదేశమూ తక్కువ తినలేదు. వివిధ రాష్ట్రాల్లో వీటిని ఎంత వేలంవెర్రిగా చూస్తున్నారనే దానిపై మేం ‘గూగుల్‌ ట్రెండ్స్‌’ ద్వారా చిన్న అధ్యయనం చేశాం. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వీటిపై ఆసక్తి వందకు వందశాతం ఉందని తేలింది! ఇవి ప్రపంచంలో ఏ మూల ఎక్కడినుంచైనా రావొచ్చు. వారిపై భౌతికంగా చర్యలు తీసుకోవడం, జైల్లో పెట్టడం దాదాపు అసాధ్యం! మనదేశంలో వ్యభిచార కూపాలు నిర్వహిస్తున్నవాళ్లూ, చిన్నారులపై లైంగికకోరిక తీర్చుకునేవాళ్లు వీటిని తయారుచేస్తున్నట్టు ఆధారాలున్నాయి. స్వయంగా మన కేంద్రప్రభుత్వం లైంగిక దాడులకు గురైన 12 వేల మంది చిన్నారుల్ని ప్రశ్నిస్తే.. వాళ్లలో ఇంచుమించు ఐదుశాతం మంది దాడి సమయంలో తమని వీడియో తీశారనే చెప్పారట. అంతగా

వీటి దృశ్యీకరణపై వ్యామోహం ఉంది మనలో! వీటికి విరుగుడుగా నాకు కనిపించిన పరిష్కారమే ‘ఆరంభ్‌ హాట్‌లైన్‌’.
ఏం చేస్తుంది ఇది.. అంతర్జాలంలో పిల్లలకి సంబంధించిన అసభ్య వీడియో దృశ్యాలు మీ కంటపడితే వెంటనే మా http:-//aarambhindia.org/report/లోకి వెళ్లొచ్చు. మీరు చూసిన వీడియో యూఆర్‌ఎల్‌, వెబ్‌సైట్‌ పేర్లు అందులో నమోదుచేయొచ్చు. మీ పేరూ, వూరు గోప్యంగానూ ఉంచొచ్చు. మీరలా సబ్‌మిట్‌ కొట్టగానే దాన్ని మేం పరిశీలించి లండన్‌లోని ‘ఇంటర్నెట్‌ వాచ్‌ ఫౌండేషన్‌’(ఐడబ్ల్యూఎఫ్‌)కి పంపిస్తాం! ప్రపంచంలో అంతర్జాలంలో అభ్యంతరకర అంశాలు ఏవి వచ్చినా దానిపై చర్యలు తీసుకునే అధికారాలున్న సంస్థ ఈ ఐడబ్ల్యూఎఫ్‌. ఈ సంస్థ అప్పటికప్పుడు ఆ వెబ్‌సైట్‌వాళ్లని సంప్రదించి ఆ దృశ్యాలు తీసేయమని ఆదేశిస్తుంది. వాళ్లు చర్యలు తీసుకునేంతవరకూ ఆగకుండా ఈలోపు తానే తాత్కాలికంగా ఆ దృశ్యాలని పూర్తిగా తొలగిస్తుంది. ఇదీ దీని క్రమం! మా ఆరంభ్‌ ఇండియా సైట్‌ ద్వారా గత ఏడాది నుంచి మేమీ ‘హాట్‌లైన్‌’ సేవలు అందిస్తున్నాం. దేశంలో ఇలాంటి వెబ్‌సైట్‌ ఇదే ప్రథమం. అది

సాధించిన విజయాల గురించి చెప్పేముందు నా గురించి కొంత..
అలా వచ్చానిటు.. మాది ముంబయి. నాన్న తన చిన్నప్పుడే కేరళ నుంచి వచ్చి కూలీనాలీ చేసుకుంటూ ఇక్కడ స్థిరపడ్డారు. అక్కనీ, నన్నూ చక్కగా చదివించారు. జీవితంలో ఎంతో శ్రమించి పైకొచ్చినవాడు కాబట్టి, చిన్నప్పటి నుంచే మాలో సేవాగుణాన్ని పెంచారు. నేను బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతుండగా మా కాలేజీలో ఓ చర్చాకార్యక్రమం పెట్టారు. ‘పేదరికం నిర్మూలించి సమాజంలో మార్పు తీసుకురావడానికి నువ్వేం చేస్తావు?’ అన్నది అంశం. నేనూ, నా సహాధ్యాయీ తీవ్రంగా వాదించుకున్నాం.. చివరికి ‘కేవలం మాటలుంటే చాలదు. చేతల్లో చూపించాలి!’ అన్నాడతను. ఆ మాటకి నాకు కోపం వచ్చింది. నేనూ సమాజంలో ఓ మంచి మార్పు తీసుకువచ్చి తీరతానని చెప్పా. అదే పట్టుదలతో డిగ్రీ ముగించి ఎమ్మే సోషల్‌వర్క్‌లో చేరిపోయా! ఏదో ఆవేశంతో చేరిపోయినా దాన్ని నేను ఆషామాషీగా తీసుకోలేదు. విశ్వవిద్యాలయ స్థాయిలో రెండోర్యాంకు సాధించా. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో బాలకార్మికుల్లో విద్య, ఉపాధి మెరుగు కోసం కృషిచేస్తున్న ‘ప్రథమ్‌’ సంస్థలో కార్యకర్తగా చేరాను. ఆ సంస్థ తరపున మూడేళ్లు బాపట్ల, కొంతకాలం హైదరాబాద్‌ పాతబస్తీలో పనిచేశాను. సామాజిక సేవపై నాకెన్నో విలువైన పాఠాలు నేర్పిన దశ అది! ప్రథమ్‌ నుంచి బయటకొచ్చి హాంకాంగ్‌కి చెందిన ఏడీఎం క్యాపిటల్‌ ఫౌండేషన్‌ అనే సంస్థకి భారతీయ మేనేజర్‌గా చేరాను. అప్పుడే తొలిసారి చిన్నారులని ఎరగా మార్చి రూపొందించే అసభ్య దృశ్యాల(చైల్డ్‌ అబ్యూజ్‌ ఇమేజినరీ)పై నా దృష్టి పడింది. అప్పట్లో థాయ్‌లాండ్‌, ఫిలిప్పైన్స్‌లో అవగాహన కార్యక్రమం ఒకటి జరిగితే

అక్కడికి వెళ్లాను. ఆరంభ్‌ ఏర్పాటుకి అదే మూలం!
ఇలా మొదలుపెట్టాను.. చిన్నారులపై లైంగిక దాడులకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్లందరికీ ఓ వనరుల కేంద్రంలా 2014లో ‘ఆరంభ్‌’ పురుడుపోసుకుంది. ముంబైకి చెందిన ‘ప్రేరణ’ సంస్థ సహకారం తీసుకున్నాను. తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, పోలీసులూ, లాయర్‌లు.. ఇలా ఎవరైనా సరే చిన్నారులపై లైంగిక దాడిని అడ్డుకోవడానికీ, దాడి జరిగిన బాధితులని ఆదుకోవడానికి, నిందితుల్ని పట్టివ్వడానికి ఏం చేయాలో ఇందులో సమగ్రమైన వివరాలుంటాయి. ఆ తర్వాత అశ్లీల దృశ్యాలపై ఐడబ్ల్యూఎఫ్‌తో మాట్లాడి 2016లో ఆరంభ్‌ హాట్‌లైన్‌ని ఏర్పాటుచేశాను.

ఈ ఏడాదిలో.. అదో వెబ్‌సైట్‌. ఇరవైమంది దాకా పిల్లలపై లైంగిక దాడి జరగడాన్ని చిత్రీకరించారు. దాన్ని చూసిన వాళ్లెవరో ఆరంభ్‌కి ఫిర్యాదుచేశారు. ఐడబ్ల్యూఎఫ్‌తో కలిసి మేం చేసిన విచారణలో తేలిందేమిటంటే అది రష్యా నుంచి విడుదలైందని! అందులో రెండొందల వీడియోలు అందులో ఉన్నాయని. ఈ వీడియోలనే కాదు, సైట్‌ కూడా కాలగర్భంలో కలిసేలా చేశాం. ఇలాంటి ఫిర్యాదులో గత ఏడాదిలోనే 436 వచ్చాయి మాకు. కేవలం అశ్లీల సైట్‌లని నివారించడమేనా? మరి బాధితులకి మీరు నేరుగా ఏమీ చేయరా అంటే…ముంబయి చుట్టుపక్కల్లోని మూడుజిల్లాల పరిధిలో ఇలాంటి బాధితులుంటే చర్యల్లోకి దిగిపోతాం. వాళ్లని కాపాడి ఆశ్రయం కూడా కల్పిస్తున్నాం! నా గురించి చెబుతూ చెబుతూ ఆరంభ్‌లో పడిపోయాను కదా. నేను మీ తెలుగింటి కోడలినే. మావారిది అనంతపురం. ముంబయిలో కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు.